- సిడబ్ల్యుఎఫ్‌ఐ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
ప్రజాశక్తి-నెల్లూరు :అసంఘటిత, భవన నిర్మాణ రంగం కార్మికుల సంక్షేమం కోసం పోరాటం చేసి బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యాక్టును సాధించుకున్నామని, ఈ యాక్టును అనుసరించి పలు రాష్ట్రాల్లో వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేశారని సిడబ్ల్యుఎఫ్‌ఐ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు తెలిపారు. నెల్లూరు నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న సిడబ్ల్యుఎఫ్‌ఐ జాతీయ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో వ్యవసాయ రంగం తరువాత అతి పెద్ద రంగం భవన నిర్మాణరంగమని తెలిపారు. ఈ నిర్మాణ రంగంలో రిజిష్టర్ అయిన కార్మికుల సంఖ్య 5 కోట్లకు పైగా ఉన్నారని తెలిపారు. రిజిష్టర్ కాకుండా అనేక ప్రాంతాల్లో పనిచేస్తున్న భవన నిర్మాణ రంగం కార్మికులు, వ్యవసాయ రంగం కుంటుపడిన తరువాత పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్న కార్మికులు, ఉపాధి కోసం ఒక ప్రాంతం నుంచి మరోక ప్రాంతానికి వెళ్తున్న కార్మికులను కలుపుకుంటే దాదాపు 8 కోట్ల మంది కార్మికులు నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని తెలిపారు. 14 శాతం జిడిపి నిర్మాణ రంగం నుంచి ప్రభుత్వ ఖజానాకు వస్తుందన్నారు. అటువంటి రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత లేదని, కనీసం నెలలో 30 రోజులకు పని దొరుకుతుందన్న భరోసా లేదని తెలిపారు. వెల్ఫేర్ బోర్డుపై ప్రభుత్వ పెత్తనం ఎక్కువైపోయిందన్నారు. కార్మికుల సంక్షేమాన్ని కేంద్రం గాలికి వదిలేసిందన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగడంలేదని, ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే అతని కుటుంబానికి ఎటువంటి రక్షణ లేదన్నారు. ఈ విధానాలన్నింటిపైనా కార్మికులు పోరాడాల్సిన అవసం ఉందని పేర్కొన్నారు. సమావేశంలో ఎపి బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ పెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజరు కుమార్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్లాడి గోపాల్, సిఐటియు నగర కార్యదర్శి జి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.










