ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్‌సభలో టిడిపి ఎంపి కె రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవంత్ కిషన్‌రావు కరాడ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రైవేటీకరణలో భాగంగానే వైజాగ్ స్టీల్ ప్లాంటులో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేస్తామని 2021 జనవరి 27న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
ఎపిలో 2,232 కంపెనీలు మూత
ఆంధ్రపద్రేశ్‌లో 2,232 కంపెనీలు మూసివేయబడ్డాయని కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. ఎంపి దేబశ్రీ చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2019 ఏప్రిల్ 1 నుంచి 2022 జులై 12 వరకు ఎపిలో 2,232 కంపెనీలు మూసివేయబడ్డాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 1,12,509 కంపెనీలు మూసివేతకు గురయ్యాయని పేర్కొన్నారు.
రూ.1,371 కోట్లు జిఎస్‌టి పరిహారం పెండింగు
ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,371 కోట్లు జిఎస్‌టి పరిహారం పెండింగులో ఉందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. వైసిపి ఎంపి పోచా బ్రహ్మానందరెడ్డి, సిపిఎం ఎంపి ఎస్ వెంకటేషన్‌తోపాటు ఎనిమిది మంది ఎంపిలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 జూన్ నాటికి ఎపికి రూ.1,371 కోట్లు జిఎస్‌టి పరిహారం పెండింగులో ఉందని, దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మొత్తం రూ.35,266 కోట్లు జిఎస్‌టి పరిహారం పెండింగులో ఉందని తెలిపారు.
రెవెన్యూ లోటు విడుదల చేశాం
రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 వరకూ ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు రూ.4,117.89 కోట్లు మాత్రమేనని, ఆ మొత్తాన్ని విడుదల చేశామని కేంద్రం తెలిపింది. 2014-15లో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు రూ.22,949 కోట్లు కాదని వైసిపి ఎంపి ఎన్ రెడ్డెప్ప అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఎపి ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు డిస్కమ్‌లకు ఫైనాన్షియల్ రిస్ట్రక్చరింగ్ ప్లాన్ బాండ్స్ నిమిత్తం రూ.1,500 కోట్లు అనుమతించి 2022 మార్చి 21న విడుదల చేసినట్లు తెలిపారు.
నాలుగేళ్లలో ఏడు పాలిటెక్నిక్ కళాశాలలు
2017-18 నుంచి 2021-22 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఏడు పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల కదలికలు గుర్తించేందుకు డ్రోన్లు వినియోగించడానికి ప్రాజెక్టు ఎలిఫెంట్ కేంద్ర ప్రాయోజిత పథకం అమలు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.










