Oct 09,2023 21:37

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్లకు సెప్టెంబరు వేతనాలను వెంటనే చెల్లించాలని యుటిఎఫ్‌ డిమాండ్‌ చేసింది. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావుతో కలిసి సచివాలయంలో సోమవారం పలు అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డిని కలిసినట్లు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఇప్పటివరకు వేతనాలు చెల్లించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతినెలా ఒకటిన వేతనాల కోసం పెన్షనర్లు, ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. గడిచిన ఆరు నెలలుగా ఐదవ తేదీ తర్వాతే ఎక్కువ మందికి వేతనాల చెల్లింపులు చేస్తున్నారని, దీనివల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. బ్యాంకుల్లో తీసుకున్న లోన్లు, వాటి ఇఎంఐలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల బ్యాంకుల్లో వడ్డీలు అదనంగా చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పిఎఫ్‌, డిఎ ఇతర బకాయిలు సెప్టెంబరు నాటికి చెల్లిస్తామని గత ఉద్యోగ, ఉపాధ్యాయ సమావేశంలో ఇచ్చిన హామీని నెరవేర్చలేదని పేర్కొన్నారు. 2003 నాటికే నోటిఫికేషన్‌ ఇచ్చి 2004 సెప్టెంబరు తర్వాత ఉద్యోగం పొందిన ఉపాధ్యాయ, ఉద్యోగులకు పాత పెన్షన్‌ అమలు చేయాలని కోరారు. సెప్టెంబరు జీతాలను మంగళవారం లోపు జమచేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారికి హామీ ఇచ్చారు. బకాయిలు చెల్లించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డిఎస్‌సి-2003 వారికి పాత పెన్షన్‌ అమలుపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.