- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు మేరకు స్థానిక విజ్జి క్రికెట్ మైదానంలో అండర్ 19 వన్డే క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ ఆర్ గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. స్థానిక విజ్జి క్రికెట్ మైదానంలో నూతనంగా నిర్మించిన క్రీడాకారులు రెస్ట్ రూం, స్కోర్ బోర్డు రూం, ఎంపైర్‌లు రూంలను రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బిసిసిఐ ఇంతమంచి అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. మొత్తం ఆరు రాష్ట్రాలకు చెందిన అండర్ 19 బాలికలు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనున్నారని తెలిపారు. వాటిలో మద్యప్రదేశ్, కేరళ, మిజోరాం, బీహార్, బరోడా, అస్సాం జట్లు పాల్గొనున్నయని తెలిపారు. ఈ నెల 8 తేదీ నుంచి 16 తేదీ వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి అని తెలిపారు. రానున్న కాలంలో మన ఆంధ్ర ప్రదేశ్‌లో క్రికెట్‌లో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. విజయనగరం, విశాఖకు మధ్యలో త్వరలో 50 వేలు మంది ప్రజలు మ్యాచ్‌ను చూసేందుకు అనుగుణంగా అంతర్జాతీయ క్రికెట్ మైదానం నిర్మాణం జరుగుతుందన్నారు. అనంతరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం ఎల్ ఎన్ రాజు మాట్లాడుతూ.. జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అందిస్తున్నా సేవలు, ప్రోత్సహం మరువలేనిదన్నారు. ఇక్కడ కొత్తగా రూముల నిర్మాణానికి 17 లక్షలు వరకు మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో క్రికెట్ మైదానాలు అభివృద్ధికి, అన్ని వసతులు ఏర్పాటు మంచి సహకారం ప్రోత్సాహం అందిస్తున్నారని రానున్న కాలంలో మరిన్ని సౌకర్యాలు క్రీడాకారులకు అందుబాటులో తెచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో క్రికెట్ అసోసియేషన్ సభ్యులు,సెలక్టర్లు పాల్గొన్నారు.










