Sep 20,2023 21:30
  • ఇరుగ్రూపుల మధ్య ఘర్షణ
  • ఒకరు మృతి

ప్రజాశక్తి-ముదిగుబ్బ (శ్రీ సత్యసాయి జిల్లా) : శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలో వినాయక చవితి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. రెండు గ్రూపుల మధ్య మొదలైన ఘర్షణ ఓ వ్యక్తి మృతికి దారి తీసింది. 20 మందికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దొరిగల్లు బిసి కాలనీలో వినాయక చవితిని పురస్కరించుకొని వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో దొరిగల్లు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వినాయక మండపం వద్దకెళ్లి రెండు ద్విచక్ర వాహనాలతో విన్యాసాలు చేశారు. అక్కడే ఉన్న బిసి కాలనీకి చెందిన కొంతమంది ఆ యువకులను మందలించారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన యువకులు వేణు, వంశీ, పవన్‌, సింహాద్రిలను వెంటబెట్టుకుని మళ్లీ వినాయక మండపం వద్దకు వచ్చారు. ఈ సమయంలో ఇరుగ్రూపుల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణలో మంజుల అనంతయ్య (55)తో పాటు పలువురిపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో అనంతయ్య తలకు తీవ్రంగా గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ఇరుగ్రూపులకు చెందిన దాదాపు 20 మంది వరకు గాయపడ్డారు. ముదిగుబ్బ సిఐ హేమంత్‌ కుమార్‌ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని చక్కదిద్దారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ముదిగుబ్బ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతయ్య భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని అడిషనల్‌ ఎస్‌పి విష్ణు పరిశీలించారు.