May 23,2023 10:38
  • సుప్రీంకోర్టుకు తెలిపిన నిపుణుల కమిటీ
  • విచారణ జరుగుతోందని నివేదన

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌లో అనుమానాస్పద లావాదేవీలు జరిపిన ఆరుగురు పెట్టుబడిదారుల కార్యకలాపాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. వీరిలో నలుగురు విదేశీ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐలు) కూడా ఉన్నారు. జనవరి 24న హిండెన్‌బర్గ్‌ నివేదిక విడుదల కాకముందు, ఆ తర్వాత అదానీ గ్రూపు షేర్లకు సంబంధించి ఆరుగురు వ్యక్తులు జరిపిన లావాదేవీలను సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ పరిశీలించింది. ఓ వైపు స్టాక్‌మార్కెట్‌ పతనమవుతుంటే ఈ ఆరుగురు పెట్టుబడిదారులు గణనీయమైన లాభాలు ఆర్జించారని కమిటీ గుర్తించింది. షేర్ల విలువ తగ్గుతుందని అంచనా వేసినప్పుడు పెట్టుబడిదారులు అమ్మకాలు జరుపుతారు. ఆ తర్వాత తక్కువ ధరకు షేర్లు కొనుగోలు చేసి లాభాలు ఆర్జిస్తారు. హిండెన్‌బర్గ్‌ నివేదికపై వివాదం చెలరేగిన నేపథ్యంలో దీనిపై విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్చి 2న నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. 2000 మార్చి-2022 డిసెంబర్‌ మధ్యకాలంలో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల ధరలు పెరగడంలో ఎలాంటి వైఫల్యాలు లేవని ఈ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఆరుగురు వ్యక్తుల లావాదేవీలపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది. వీరిలో నలుగురు ఎఫ్‌పిఐలు, ఒక కార్పొరేట్‌ సంస్థ, ఒక వ్యక్తి ఉన్నారు. వీరి పేర్లను మాత్రం కమిటీ వెల్లడించలేదు. హిందెన్‌బర్గ్‌ నివేదికకు ముందు ఈ ఆరుగురు వ్యక్తులు షేర్లను విక్రయించి, నివేదిక బహిర్గతమైన తర్వాత కొనుగోలు చేశారని నివేదిక గుర్తించింది. తక్కువ ధరకు షేర్లను కొనుగోలు చేయడం ద్వారా గణనీయమైన లాభాలు ఆర్జించారని తెలిపింది. ఈ ఆరుగురు పెట్టుబడిదారుల లావాదేవీలపై సవివరమైన విచారణ జరుగుతోంది.