- సిఐటియు, సిడబ్ల్యుఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు హేమలత
ప్రజాశక్తి-నెల్లూరు : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాల వల్ల రైతాంగం, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, అదే సమయంలో దేశ సంపదనంతా కార్పొరేట్లకు కట్టబెట్టే పరిస్థితులు నెలకొన్నాయని సిఐటియు, సిడబ్ల్యుఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు కె.హేమలత అన్నారు. నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న సిడబ్ల్యుఎఫ్‌ఐ జాతీయ సమావేశాల్లో భాగంగా శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. భవన నిర్మాణ రంగం కార్మికుల సమస్యల పరిష్కారానికి నిర్వహించాల్సిన ఉద్యమాలకు సంబంధించిన కార్యాచరణ రూపొందించడం, కార్మికులను చైతన్య పరచడం వంటి అంశాలపై చర్చలు నిర్వహించామన్నారు. కార్మికులకు ప్రావిడెండ్ ఫండ్, కనీస వేతనాలు, ఇఎస్‌ఐ వంటివి అమలు కావడం లేదని తెలిపారు. రాబోవు రోజుల్లో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దేశ వ్యాప్తంగా పోరాటాలు చేసేందుకు సమాయత్తం అవుతున్నామన్నారు. 29 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లుగా కేంద్రం మార్చేసిందని విమర్శించారు. అవి అమలు అయితే కార్మికులపై మరింత భారాలు మోపబడతాయని తెలిపారు. కార్మికులు కష్టపడి సాధించుకున్న హక్కులను సైతం కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబరు తరువాత మరికొన్ని ముఖ్యమైన పోరాటాలు జరగనున్నాయన్నారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రమణరావు, జిల్లా అధ్యక్షులు చాన్‌బాషా, సిఐటియు నాయకులు కెసి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.










