Oct 06,2023 21:01

త్వరలోనే టిడిపి, జనసేన జెఎసి ఏర్పాటు
నేడు లైట్లు ఆపి నిరసన తెలియజేయండి
చంద్రబాబుతో ములాఖత్‌ అనంతరం మీడియా సమావేశంలో లోకేష్‌
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి:వైసిపి సర్కారు తప్పులను బయటపెట్టి, ప్రజల తరుపున పోరాడుతున్నందుకే దొంగ కేసులు పెట్టి, వ్యవస్థలను మేనేజ్‌ చేసి చంద్రబాబును రిమాండ్‌కు పంపారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాఋతో నారా లోకేష్‌, భువనేశ్వరి, బ్రాహ్మణి శుక్రవారం ములాఖత్‌ అయ్యారు. అనంతరం మీడియాతో లోకేష్‌ మాట్లాడారు. పోలవరం నిర్మాణం, పరిశ్రమలు, ఎపి జలాల కోసం జగన్‌ సర్కారును నిలదీసినందుకు, ఇసుక, మద్యం దందా గురించి ప్రశ్నించినందుకు చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. 'స్కిల్‌' కేసులో ప్రభుత్వం తొలుత రూ.మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని, తరువాత రూ.371 కోట్లు అని, ఇప్పుడు రూ.27 కోట్లు అంటుందని అన్నారు. అవినీతి చేయాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. తనపైనా ప్రభుత్వ తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ శనివారం సాయంత్రం ఏడు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిఒక్కరూ లైట్లు ఆపి కొవ్వొత్తులు, కాగడాలు లేదా సెల్‌ ఫోన్‌ టార్చ్‌ లైట్‌ వేయాలని కోరారు.
త్వరలో టిడిపి జనసేన జెఎసి
టిడిపి, జనసేన జెఎసిని కమిటీని త్వరలో ప్రకటిస్తామని లోకేష్‌ తెలిపారు. టిడిపి, జనసేన కలిసే పోటీకి వెళ్తాయని, ఎక్కడ నుంచి ఎవరు పోటీ చేయాలన్నది త్వరలో తాము నిర్ణయించుకుంటామని స్పష్టం చేశారు. యువగళం పాదయాత్రపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రధాని, కేంద్ర హోం మంత్రిని తాను ఆపాయింట్‌మెంట్‌ అడగలేదని, రాష్ట్రపతిని కలసి రాష్ట్రంలో జరిగే రాజ్యాంగ ఉల్లంఘన, దొంగ కేసుల గురించి చెప్పానన్నారు. చంద్రబాబుకు జైల్లో సరైన భద్రత లేదని ఆరోపించారు. ఆయన అరెస్టు అంశంలో కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందనడానికి ఆధారాలు లేవని, ఆధారాలు లేకుండా తాను ఆరోపణలు చేయనని తెలిపారు. అనంతరం ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యనాయకులతో సమావేశం అయ్యారు. ఢిల్లీలో చేసిన న్యాయపోరాటంపై నాయకులకు వివరించారు. రానున్న కాలంలో పోరాటాలను మరింత ఉధృతం చేయాలని కోరారు.