May 29,2023 09:45
  • ఇంధన ధరలకు కళ్లెం వేయకుండా ఖర్చు తగ్గెదెలా ?
  • విడి భాగాల రేట్లు, పన్నులు, సెస్‌లు తగ్గించాల్సిందే

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో రవాణా రంగానిది కీలకపాత్ర. మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలంటే రహదారుల నిర్మాణాలతో పాటు వాహనాలకు సంబంధించిన ఇంధన, ఇతర సమస్యలను పరిష్కరించాల్సివుంటుంది. ప్రధానంగా డీజిల్‌, పెట్రోలు ధరలు భారీగా పెరిగిపోవడం, టోల్‌ ఛార్జీలు అడ్డుగోలుగా పెంచేయడం రవాణా రంగాన్ని చావు దెబ్బతీస్తున్నాయి. దీంతో రవాణాకయ్యే ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోయి ప్రజలపై పెను భారం పడుతోంది. చతికిలపడిన రవాణా రంగానికి పునర్జీవం కల్పించాలంటే భారాలు తగ్గించడం ఒక్కటే మార్గం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో శనివారం జరిగిన నీతి అయోగ్‌ సమావేశంలో ఉత్పాదక రంగంలో రవాణా ఖర్చులను భారీగా తగ్గించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను రాష్ట్రంలోని వాహన యజమానులు, రవాణా రంగంపై ఆధారపడినవాళ్లు అంతా స్వాగతిస్తున్నారు. కానీ ఆ ఖర్చు తగ్గించే బాధ్యత పాలకులపైనే ఉందన్న సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. డీజిల్‌, పెట్రోలు, ఇతర గ్రీజ్‌, ఇంజిన్‌ ఆయిల్‌ వంటి ఇతర పెట్రో ఉత్పత్తులు, వాహనాల విడి భాగాలు వంటి ధరలకు కళ్లెం వేయకుండా, టోల్‌ ఛార్జీలు, సెస్‌లు, ఇతర పన్ను భారాలు తగ్గించకుండా రవాణా ఛార్జీలు తగ్గాలంటే ఎలా తగ్గుతాయని వారు ప్రశ్నిస్తున్నారు.
          దేశంలో రవాణా ఖర్చులు స్థూల దేశియోత్పత్తి (జిడిపి)లో 15 శాతంగా వుంది. అమెరికా లాంటి దేశాల్లో అది 7.5 శాతంగా వుంది. దేశంలో రవాణా ఖర్చులను కనీసంగా 9 శాతానికి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రవాణా ఖర్చులను 15 శాతం నుండి 9 శాతానికి తగ్గించే లక్ష్యంతో జాతీయ రవాణా విధానాన్ని (లాజిస్టిక్‌ పాలసీ) విడుదల చేసింది. కానీ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిరవధికంగా పెట్రో ధరలను పెంచుతూనేపోతోంది. వాహనాల స్పేర్‌ పార్ట్స్‌ ధరలు, పన్నులు, టోల్‌ చార్జీలు యేటికేడూ గుదిబండగా మారుతున్నాయి. ప్రకటనల్లో, పాలసీల్లో గొప్పలు చెప్పి చేతల్లో భారాలు మోపితే రవాణా ఖర్చు ఎలా తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వ వాహన రంగంపై ఆధారపడిన యజమానులు, ఉద్యోగులు, కార్మికులు నిలదీస్తున్నారు.
           ముఖ్యంగా రవాణా రంగంలో కీలకం డీజిల్‌ ధర..కేంద్ర ప్రభుత్వం ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెంచుతూ పోతోంది. కేంద్రంతో పోటీగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సెస్‌ల రూపంలో పెట్రో ఉత్పత్తులపై అదనపు భారం మోపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కారణంగా ప్రస్తుతం లీటర్‌ డీజిల్‌ ధర రాష్ట్రంలో లీటర్‌ రూ 99.50గా వుంది. ఇది పొరుగు రాష్ట్రాల కంటే రూ.5 ఎక్కువ. అలాగే రోడ్‌ ట్యాక్స్‌లు కూడా భారీగా పెంచుతున్నారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రవాణా వాహనాల త్రైమాసిక పన్నులను భారీగా పెంచింది. ఆరు టైర్ల లారీకి రూ.4,790, పది టైర్ల లారీకి రూ.8,390, 12 టైర్ల లారీకి రూ.10,910, 14 టైర్ల లారీకి రూ.13,430, 16 టైర్ల లారీకి రూ.15,590 చేసింది. అలాగే గ్రీన్‌ ట్యాక్స్‌ను కూడా ఏకంగా రూ.20 వేల వరకు పెంచింది. పొరుగు రాష్ట్రాల్లో గ్రీన్‌ ట్యాక్స్‌ రూ.200 నుండి రూ.500 మించి లేకపోవడం గమనార్హం.
              రాష్ట్రంలో రోడ్ల నిర్వహణలోపం కూడా రవాణా రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. రోడ్లు గుంతలు, గుంతలుగా వుండటంతో వాహనాలు మరమ్మతులకు గురై యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలా రాష్ట్రంలో వాహనరంగంపై డీజిల్‌, పన్నులు, టోల్‌ చార్జీలు ఏటేటా పెంచుతూ రవాణాఖర్చులను తగ్గించడం ఎలా సాద్యం అవుతుందని లారీ యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఇంధన ధరలు, పన్నులు, టోల్‌ ఛార్జీలు తగ్గించి రవాణా రంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ లారీ ఓనర్స్‌ అసోషియేషన్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వైవి ఈశ్వరరావు కోరారు. నేషనల్‌ లాజిస్టిక్‌ పాలసి మేరకు రవాణా ఖర్చులను తగ్గించే అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో వ్యవహరించాలని పేర్కొన్నారు.