ప్రజాశక్తి-అమరావతిబ్యూరో :జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం జాబ్ కేలండరు విడుదల చేసి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. జాబ్ కేలండరు హామీపై చర్చించాలని మండలి ఛైర్మన్ మోషేన్‌రాజుకు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గురువారం వాయిదా తీర్మానం అందించారు. ఈ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. ప్రతియేటా జాబ్ కేలండర్ విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని లక్ష్మణరావు ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రంలో గ్రూప్-1, 2, 3, 4 ప్రభుత్వ ఉద్యోగాలు 40 వేలకుపైగా ఖాళీగా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు కేవలం 10,134 పోస్టులను మాత్రమే భర్తీ చేశారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిఎస్‌సి నోటిఫికేషనూ ఇవ్వలేదన్నారు.










