Sep 28,2023 21:01

సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లింపు దారుణం
పోడు భూములకు పట్టాలివ్వాలి : వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి- రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా):రంపచోడవరం ఏజెన్సీలో ఆదివాసీల బతుకులు దయనీయంగా మారాయని, సమస్యలు చుట్టుముట్టాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. సబ్‌ప్లాన్‌ నిధులను జగనన్న నవరత్నాలకు, సంక్షేమ పథకాల అమలుకు మళ్లించడం దారుణమని పేర్కొన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రంపచోడవరంలో గురువారం జరిగిన సిపిఎం ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కారు ఆదివాసీలపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని తెలిపారు. పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవానికి గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం శోచనీయమన్నారు. గతంలో వామపక్షాల పోరాటంతో వచ్చిన అటవీ సంరక్షణ చట్టాన్ని నీరుగార్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల హక్కులు, సంక్షేమం గురించి ఉపన్యాసాలు ఇస్తుందే తప్ప, గిరిజనుల కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదని విమర్శించారు. ఇటువంటి ప్రభుత్వాలు ఆదివాసీల అభివృద్ధికి ఏం పనిచేస్తాయని ప్రశ్నించారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న వారిని ప్రభుత్వాధికారులు ఆ భూముల నుంచి వెళ్లగొట్టడం దారుణమన్నారు. ఆదివాసీల భూములను లాక్కొని విద్యుదుత్పత్తి చేస్తామని, అభివృద్ధి బాట పట్టిస్తామని మోడీ, జగన్‌ ప్రభుత్వాలు మాయమాటలు చెప్పి మొత్తం అడవులను అదానీకి కట్టబెడుతున్నాయని విమర్శించారు. అడవుల మీద, పోడు భూముల మీద పూర్తి హక్కు ఆదివాసీలకే ఉంటుందని గుర్తు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే ధనలక్ష్మి నియోజకవర్గ అభివృద్ధిలో విఫలమయ్యారని విమర్శించారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేసి గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. గత బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జిపిఎస్‌ బిల్లును పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు తీవ్రంగా ప్రతిఘటించినా వైసిపి ప్రభుత్వం దాన్ని ఆమోదించడం దారుణమన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఒపిఎస్‌ను అమలు చేస్తే తమకు అప్పు కూడా పుట్టదని చెప్పారని, అప్పుల కోసం ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయడం భావ్యమా? అని ప్రశ్నించారు. ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన వారు రూ.25 వేలు, రెండుసార్లు చేసిన వారు రూ.50 వేలు పెన్షన్‌ తీసుకుంటున్నారని, వారు ఆ పెన్షన్లను త్యాగం చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులను ఆదుకోవచ్చుకదా? అని అన్నారు. ఒపిఎస్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లోతా రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌, కార్యదర్శివర్గ సభ్యులు ఎం.వాణిశ్రీ, పి.వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.