భద్రాచలం : ఆంధ్రలో విలీనమైన 5 గ్రామ పంచాయతీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల చాలా బాధపడుతున్నానని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భద్రాచలం పర్యటనలో భాగంగా వీరభద్ర ఫంక్షన్ హాల్‌లో ఆదివాసీలతో గవర్నర్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పలు సమస్యలను విన్నవించారు. ఆంధ్రాలో విలీనమైన గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపి ఇక్కడి ప్రజల బాధలను అర్థం చేసుకోవాలని కోరారు. గోదావరి వరదలతో ఇక్కడి ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని.. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని.. విలీన గ్రామాల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తమిళిసై హామీ ఇచ్చారు.










