ప్రజాశక్తి-పిసిపల్లి (ప్రకాశం జిల్లా):ప్రకాశం జిల్లా పిసిపల్లి మండలంలో రోజురోజుకూ పెరుగుతున్న కిడ్నీ వ్యాధి తీవ్రత గురించి, మంచినీటి సమస్య గురించి శాసన మండలిలో లేవనెత్తుతానని ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు అన్నారు. ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని సిపిఎం చేపట్టిన పాదయాత్ర ఆదివారం పిసిపల్లి మండలంలోని పెద అలవలపాడుకు చేరింది. పాదయాత్రకు లక్ష్మణరావు సంఘీభావం తెలిపి.. పాదయాత్రలో నడిచారు. ఈ సందర్భంగా పెదఅలవలపాడులో కనిగిరి డివిజన్ నాయకులు బడుగు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఒక వైపు చంద్రయాన్‌ా3ను ప్రయోగించి దేశం అభివఅద్ధి వైపు పయనిస్తుంటే.. మరోవైపు స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో పాలకులు ఉన్నారని అన్నారు. కనిగిరి నియోజకవర్గంలో మొత్తం 115 మంది డయాలసిస్ రోగులు ఉండగా, ఒక్క పిసిపల్లి మండలంలోనే 40 మంది వరకు డయాలసిస్ రోగులు ఉండడం బాధాకరమన్నారు. ఈ ప్రాంతంలోని నీళ్లలో ఫ్లోరోసిస్, విష రసాయనాలు అధికంగా ఉండడం వల్ల ఈ ప్రాంత ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో పిసిపల్లిని చేర్చాలని, ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్, జిల్లా నాయకులు జివి.కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు మాట్లాడారు. ఈ పాదయాత్ర రామాపురం నుండి ప్రారంభమై పెదఅలవలపాడు, పాలేటి గంగమ్మ గుడి మీదుగా పొన్నలూరు మండలం పరుచూరివారిపాలెం వరకు సాగింది.










