-భార్యా పిల్లలను తుపాకీతో కాల్చి చంపి తానూ ఆత్మహత్య
-సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్
ప్రజాశక్తి- కడప అర్బన్:కడపలో దారుణం చోటుచేసుకుంది. ఒక హెడ్ కానిస్టేబుల్ తన భార్య, పిల్లలను హత్య చేయడమే కాకుండా తానూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది ఇందుకు సంబంధించి మీడియాకు డిఎస్‌పి షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం... వైఎస్‌ఆర్ జిల్లా పులివెందులకు చెందిన వెంకటేశ్వర్లు (55) కడపలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా రెండేళ్లుగా పనిచేస్తున్నారు. కస్టోడియన్‌గా, రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. స్థానిక కో-ఆపరేటివ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కస్డోడియన్ ఆధీనంలో పోలీసుల రివాల్వర్లు, తుపాకీలు ఉంటాయి. విధి నిర్వహణ అనంతరం బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ నుంచి వెంకటేశ్వరరావు ఇంటికి చేరుకున్నారు. తన ఆధీనంలోని ఉన్న ఒక రివాల్వర్‌ను తనతో తీసుకెళ్లారు. ఇంట్లో నిద్రిస్తున్న తన భార్య మాధవీలత (50), కుమార్తెెలు లికిన్య (21), అభిజ్ఞ (16)లను ఆ రివాల్వర్‌తో కాల్చి చంపారు. ఆ తర్వాత అదే రివాల్వర్‌తో తానూ ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి ముందు ఆయన సూసైడ్ నోట్ రాశారు. తనకు రెండో భార్య ఉందని, ఆమెకు, ఆమె కుమారుడికి తన బెనిఫిట్స్ చెందించాలని ఈ నోట్‌లో రాసి ఉంది. పోస్టుమాస్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు.
- కారణాలు వెలికితీస్తాం : ఎస్‌పి
ఈ ఘటనకు కారణాలను పోలీస్ విచారణలో వెలికితీస్తామని ఎస్‌పి సిద్థార్థ్ కౌశల్ తెలిపారు. రిమ్స్ మార్చురీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్, ఆయన కుటుంబసభ్యుల మృతదేహాలను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో ఎస్‌పి మాట్లాడుతూ ఈ ఘటనలకు కారణం ఆర్థిక సమస్యలా? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అనేది విచారణ చేస్తామని చెప్పారు.
- మృతదేహాలను సందర్శించిన డిప్యూటీ సిఎం, మేయర్
సంఘటనా స్థలికి డిప్యూటీ సిఎం అంజాద్‌బాష, మేయర్ సురేష్‌బాబు వచ్చి మృతదేహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర్లను బట్టు స్వామి అని తాము పిలిచేవారని తెలిపారు. ఆయన చాలా మంచివారని, ఈ ఘటన బాధాకరమని వారు పేర్కొన్నారు.










