కోయంబత్తూర్ : దేశంలో రైల్వే ప్రైవేటీకరణ దిశగా మొదటి అడుగు పడింది. 'భారత్ గౌరవ్' పథకం కింద కేంద్రం ప్రారంభించిన మొదటి ప్రైవేట్ రైలు మంగళవారం పట్టాలెక్కింది. అయిదు రోజుల పాటు ప్యాకేజీ టూర్ కింద ఇందులో ప్రయాణించవచ్చని దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. 1100 మంది ప్రయాణికులతో 'దేఖో అప్నా దేశ్' పేరిట మంగళవారం సాయంత్రం 6 గంటలకు కోయంబత్తూరు నార్త్‌లో బయలుదేరిన రైలు సాయినగర్ శిర్డీకి 16వ తేదీ ఉదయం 7.25 గంటలకు చేరుతుందని ఆ ప్రకటనలో తెలిపింది. తిరుపూరు, ఈరోడ్, సేలం, ఎలహంక, ధర్మవరం, మంత్రాలయం రోడ్, వాడి మీదుగా వెళ్తుందని వెల్లడించింది. మంత్రాలయం రోడ్‌లో మంత్రాలయం ఆలయ సందర్శనార్థం అయిదు గంటల పాటు అక్కడ ఆగుతుందని తెలిపింది. తిరుగు ప్రయాణంలో సాయినగర్ శిర్డీలో 17వ తేదీ ఉదయం 7.25 గంటలకు బయలుదేరి కోయంబత్తూరు నార్త్‌కు 18న మధ్యాహ్నం 12 గంటలకు చేరుతుందని ప్రకటించింది. ఆధునిక హంగులతో బోగీలు తయారుచేశారని, అందుబాటులో వైద్యుడు, రైల్వే పోలీసులతో పాటు ప్రైవేటు భద్రతా సిబ్బంది, ఎసి మెకానిక్, అగ్నిమాపక సిబ్బంది ఉంటారని తెలిపింది. రుచికరమైన శాఖాహార వంటకాలు అందించనున్నట్లు వివరించింది. ప్యాకేజీలో భాగంగా విఐపి దర్శనం, బస్సు వసతులు, ఎసి బస వసతితో పాటు టూరిస్టు గైడ్లను అందుబాటులో ఉండనున్నారు.










