Apr 05,2023 11:00

న్యూఢిల్లీ : గుజరాత్‌కి చెందిన చిన్న సంస్థ అదికార్ప్‌తో అదానీ గ్రూపునకు గల సంబంధాలపై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ మరో అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. మార్చిలో ప్రభుత్వం నిర్వహించిన వాణిజ్య బొగ్గు గనుల వేలంలో గనులను గెలుచుకున్న కంపెనీల్లో అదానీ గ్రూపు ఒకటి. అత్యంత తక్కువ ధరలకు నాలుగు బొగ్గు గనులను చేజిక్కించుకుంది. వాటిల్లో ఒక బ్లాక్‌ పేరు నార్త్‌ వెస్ట్‌ ఆఫ్‌ మాధేరి. ఈ బొగ్గు గనికి జరిగిన వేలంలో అదానీ కాకుండా కేవిల్‌ మైనింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే పేరుతో మరో బిడ్డర్‌ ఒక్కటే వుంది. ఈ కేవిల్‌ మైనింగ్‌ లిమిటెడ్‌ యజమాని అదికార్ప్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రధాన ప్రమోటర్‌గా కూడా వున్నట్లు దర్యాప్తులో తేలింది. అదానీ కంపెనీల మధ్య నిధులకు మార్గనిర్దేశనం చేయడానికి ఉపయోగించే చిన్న ప్రైవేట్‌ కంపెనీ అదికార్ప్‌ అని హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌లో వెల్లడైంది. దీంతో తాజాగా అదికార్ప్‌తో అదానీ గ్రూపునకు గల సంబంధాలపై దర్యాప్తు జరగాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేస్తోంది. అదానీ గ్రూపు వ్యవస్థాపకుడైన గౌతమ్‌ అదానీ జీవిత చరిత్ర ఇటీవలే ప్రచురితమైంది. అందులో షాను తన స్నేహితుడిగా పేర్కొంటూ సుడొకు పజిల్స్‌ను సాల్వ్‌ చేయడంలో తనతో పోటీ పడలేడని అదానీ చెప్పుకున్నారు. మైనింగ్‌ రంగంలో ఎలాంటి అనుభవం లేని కెవిల్‌ మైనింగ్‌, లక్ష రూపాయిల పెయిడ్‌ అప్‌ కేపిటల్‌తో అదానీ అనుబంధ సంస్థ అయిన ఎంహెచ్‌ నేచురల్‌ రీసోర్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో పోటీ పడింది. అదికూడా మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో గల నార్త్‌వెస్ట్‌ ఆఫ్‌ మాధేరి బ్లాక్‌ మైనింగ్‌ హక్కుల కోసం. ఆ బ్లాక్‌లో దాదాపు 20కోట్ల టన్నుల బొగ్గు వుందని అంచనా. ఈ బొగ్గు గని కోసం వేలం నిర్వహించినపుడు అదానీ ఒక్కరే బిడ్డర్‌ అయితే వేలం రద్దు అయి వుండేది. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ నిబంధనల ప్రకారం వాణిజ్య బొగ్గు గని వేలానికి కనీసం ఇద్దరు బిడ్డర్‌లు వుండాలి. అప్పుడే ఆ వేలం చెల్లుబాటు అవుతుంది. బొగ్గు గనుల వేలం విషయాల్లో కుమ్మక్కు జరిగిందంటూ గతంలో కాగ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.