Feb 15,2023 15:47

దుబాయ్ : టెస్టు క్రికెట్‌లో టీమిండియా మళ్లీ నెంబర్‌ వన్‌ స్థానాన్ని చేజిక్కించుకున్నది. ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచింది. తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ ఆసీస్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం రోహిత్‌ సేన 115 రేటింగ్‌ పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.. 111 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్‌ (106), న్యూజిలాండ్‌ (100), సౌతాఫ్రికా (85) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టెస్టుల్లో టీమ్‌ఇండియా టాప్‌లోకి దూసుకెళ్లడంతో అన్ని ఫార్మాట్లలో నంబర్‌ వన్‌ జట్టుగా నిలిచింది. వన్డేలు, టీ20ల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
ఆసీస్‌తో తొలి టెస్టులో సెంచరీ బాదిన రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. అశ్విన్‌, జడేజాలు కూడా టెస్టుల్లో తమ ర్యాంక్‌లను మరింత మెరుగుపరుచుకున్నారు. బౌలింగ్‌ విభాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ తొలి ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. అతనికి 21 రేటింగ్‌ పాయింట్ల దూరంలో అశ్విన్‌ ఉన్నాడు.