వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూలై 12న డొమెనికా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో టీమిండియా టూర్ ప్రారంభం కానుంది. కాగా వెస్టిండీస్ జట్టు ప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ ఆడటంతో జూలై 12న మొదలు కావాల్సిన టెస్టు సిరీస్ ఆలస్యం కానున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలను బీసీసీఐ వర్గాలు కొట్టిపారేశాయి. ''భారత్-విండీస్ షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు లేదు. క్రికెట్ వెస్టిండీస్ వారి సన్నాహకాలు సంబంధించి సమస్యలను ఎదుర్కొంటోంది. అది విండీస్ క్రికెట్ పరిష్కరించుకుంటుంది. షెడ్యూల్‌లో స్వల్ప మార్పు కూడా మొత్తం పర్యటనకు ఆటంకం కలిగిస్తుంది'' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్‌సైడ్ స్పోర్ట్‌తో పేర్కొన్నారు.










