విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్.. ఇలా చెబితే చాలామంది గుర్తు పట్టరు. ఇళయ దళపతి విజయ్.. అంటే గుర్తుపట్టని వారుండరు. తమిళ సినీ దర్శకుడు, ప్రొడ్యూసర్ ఎస్.ఏ చంద్రశేఖర్ తనయుడిగా 'వెట్రి' (1984) చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండిస్టీలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్, 'నాళయ తీర్పు' (1992) అనే సినిమాతో సోలో హీరోగా డెబ్యూ ఇచ్చాడు. ఇక 2000లో విడుదలైన 'ఖుషి' సినిమా వరకూ అప్పుడప్పుడూ హిట్స్ కొడుతున్న విజయ్, 'ఖుషి' సినిమాతో ఒక్కసారిగా ఫ్యూచర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్నాడు. ఆ వెంటనే 'గిల్లీ', 'తిరుపాచ్చి', 'శివకాశి', 'పోకిరి' సినిమాలు సూపర్ హిట్స్ అవ్వడంతో విజయ్ కాస్త 'ఇళయ దళపతి విజయ్' అయ్యాడు. ఫ్యూచర్ స్టార్ అనే మాటని చెరిపేసి స్టార్ హీరో అయ్యాడు. అయినా చిత్ర ప్రమోషన్లు, ఇంటర్వ్యూల్లో పాల్గొనడం చాలా అరుదు.
బాల్యం నుంచే నటనపై ఆసక్తి..
విజయ్ చిన్నతనమంతా మద్రాస్‌లోనే గడిచింది. విజయ్ కుటుంబం చాలా కష్టాలు పడింది. విజయ్ చిన్నతనంలో వారి జీవితాలు అంతంత మాత్రంగానే ఉండేవి. వాళ్లమ్మ కచేరీలకు వెళ్తే రోజుకి వంద రూపాయలు మాత్రం వచ్చేవి. అవి వచ్చిన రోజు కడుపు నిండా భోజనం ఉండేది. లేనిరోజు పస్తులే. అలాంటి పరిస్థితులను దాటుకుని, అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది విజయ్ కుటుంబం. విజరుపై తల్లిదండ్రుల ప్రభావం ఉండటంతో మొదట్నుంచీ సినిమాలపై ఆసక్తి ఉండేది. అందుకే తన తండ్రి తీసిన 'వెట్రి' అనే చిత్రంలో బాల నటుడిగా చేశాడు. తర్వాత మరో ఐదు సినిమాల్లోనూ బాల నటుడిగా కనిపించాడు. వీటిలో రజినీకాంత్ హీరోగా నటించిన 'నాన్ శివప్పు మనిధన్' ఒకటి. ఇక తల్లి గాయని కావడం వల్ల చిన్నతనం నుంచే విజయ్ కి కూడా పాడటం అలవాటైంది. ఆ టాలెంట్ అతనికి అడిషనల్ అట్రాక్షన్ అయ్యింది. మొదటిసారి 'రసిగన్' సినిమాలో విజయ్ తన గొంతు వినిపించాడు. ఆ తర్వాత అనేకమంది ప్రముఖ సంగీత దర్శకులు అతనితో పాటలు పాడించారు.
ఆయనే లేకపోతే.. నేను లేను..
తండ్రి దర్శకుడైనా.. విజయ్ మాత్రం ఆడిషన్‌లో సెలెక్ట్ అయ్యే మొదటి చిత్రంలో నటించడం గమనార్హం. ఆడిషన్‌లో హీరో రజినీకాంత్ నటించిన 'అన్నామలై' చిత్రంలోని ఓ డైలాగ్ చెప్పాడు విజయ్. అదే తనకి మొదటిసారి హీరో అవకాశాన్ని కల్పించిందని, రజినీకాంత్ అనే ఆయనే లేకపోతే ఈ రోజు తాను లేనని విజయ్ చాలా సందర్భాల్లో చెప్పాడు. అయితే ఎంట్రీ ఈజీగానే ఇచ్చినా.. పేరు, స్టార్‌డమ్ మాత్రం కష్టపడే సంపాదించుకున్నాడు. 'ఇక అభిమానుల విషయానికి వస్తే ఇది కచ్చితంగా నేను ఊహించని బహుమతి. అన్ని వర్గాల ప్రేక్షకులూ నన్ను ఆదరిస్తున్నారు.. ఇది చాలా సంతోషించదగ్గ విషయం' అని చెప్పారు. ఇక ఇంటర్వ్యూల్లో పాల్గొనక పోవడానికి కారణం 'గతంలో కొన్ని మాధ్యమాల్లో నాపై తప్పుగా ప్రచారం చేశారు. అది నన్ను తీవ్రంగా బాధించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను చాలా ఎమోషనల్ పర్సన్‌ని. అందుకే ఓ సాధారణ మనిషిగా ''టేక్ ఇట్ ఈజీ.. మేక్ ఇట్ ఈజీ..'' అనే మంత్రాన్ని పాటిస్తుంటా' అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
సబ్జెక్ట్ సెలెక్షన్‌లోనూ వెనక్కి తగ్గడు..
విజయ్ యాక్టింగ్ స్టయిల్‌తో పాటు సబ్జెక్ట్ సెలెక్షన్‌లో కూడా మారింది. డిఫరెంట్ కాన్సెప్టులు ఎంచుకుంటూ మాస్ హీరోగా ఎవరూ అందుకోలేనంత ఎత్తుకి ఎదిగాడు. ఇక రాజకీయంగా తన సినిమాల్లో బిజెపిని టార్గెట్ చేసేలా విజరు డైలాగ్స్ ఉన్నాయి. విజయ్ నటించిన మెర్సల్ సినిమాలో జీఎస్టీని హేళన చేస్తూ డైలాగ్స్ ఉన్నాయి. ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఆయన ఇంట్లో పన్ను ఎగవేతకు సంబంధించి సోదాలు చేశామని, ఐటీ అధికారులు ప్రకటించారు. సర్కార్ సినిమాలోనూ కమలం పార్టీని ఉద్దేశించి విజయ్ రాజకీయ కామెంట్లు చేశారు. ఇక బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే విజరును టార్గెట్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. అయినా విజయ్ ఏమాత్రం వెనుకడుగు వేయలేదు.
స్వచ్ఛంద సేవలోనూ..
విజయ్ తోబుట్టువైన విద్య రెండేళ్ల వయసులోనే చనిపోయింది. దీంతో ఆ ప్రభావమంతా తనపై తీవ్రంగా పడింది. హీరోగా ఎదిగిన తర్వాత చెల్లెలి పేరుతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఆమె పేరుతో విద్య విజయ్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌ను స్థాపించాడు. తరచూ ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని చేపడుతూనే ఉంటాడు. చదువును మధ్యలోనే ఆపేస్తున్న చిన్నారులని మళ్లీ స్కూళ్లకు పంపించేందుకు సాయం చేస్తుంటారు. ఆర్టిస్టులూ టెక్నీషియన్ల సమస్యపై నిరాహారదీక్షలు సైతం చేశాడని కొందరికే తెలుసు. యుద్ధాలు, ధర్నాలప్పుడు తన స్వచ్ఛంద సంస్థ ద్వారా పేదవాళ్లను ఎప్పటికప్పుడు ఆదుకుంటూనే ఉంటాడు. ఆర్థిక స్థోమత లేని విద్యార్థులకు అండగా నిలబడతాడు.
పేరు: విజయ్ జోసెఫ్
అసలు పేరు: విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్
పుట్టిన తేదీ: జూన్ 22, 1974
పుట్టిన ప్రాంతం: చెన్నయ్
భార్య: సంగీత ఎస్
పిల్లలు: దివ్య సాషా, జాసూన్ సంజయ్
తల్లిదండ్రులు: ఎస్.ఎ.చంద్రశేఖర్, శోభ (గాయని)