May 03,2023 21:55

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయాల్లో రోజువారీ పౌరసేవల టార్గెట్లకు ప్రభుత్వం స్వస్తి పలికింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులు ప్రతిరోజూ కనీసం 10 సర్వీసులైనా పూర్తి చేయాలనే నిబంధన ఉండేది. లక్ష్యాలను పూర్తి చేయని ఆయా గ్రామ, వార్డు సెక్రటరీలకు ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులివ్వడం, క్రమశిక్షణ చర్యలు ఉండేవి. అయితే ప్రజల నుంచి కొన్ని సర్వీసులకు లక్ష్యాలకు అనుగుణంగా దరఖాస్తులు రాకపోతుండటంతో సచివాలయ ఉద్యోగులు పౌరసేవల టార్గెట్లను పూర్తి చేయడంలో వెనకబడేవారు. ఈ నేపథ్యంలో రోజువారీ టార్గెట్లు తీసివేయాలని ప్రభుత్వానికి పలు దఫాలు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు వినతిపత్రాలు సమర్పించారు. రోజువారీ లక్ష్యాల విషయంలో మినహాయింపునిస్తూనే సచివాలయాలు అవసరమైన అన్ని సేవలనూ సజావుగా, ముందస్తుగా అవసరమైన పౌరులకు ఆలస్యం లేకుండా అందించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిజమైన కేసుల్లో సర్వీసుల తిరస్కరణ లేదా ప్రాసెసింగ్‌లో అనుకోకుండా జాప్యం జరిగినట్లు ఏదైనా ఫిర్యాదు అందితే తక్షణమే నిబంధనల ప్రకారం సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సిటిజన్స్‌ ఔట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌, బెనిఫిషియరీ ఔట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా పౌరులను చేరుకోవాలని గ్రామ, వార్డు సెక్రటేరియట్‌లో అందుబాటులోని సేవలను సూచించే పౌరుల చార్టర్‌ గురించి అవగాహన కల్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.