Mar 04,2023 17:16

అహ్మదాబాద్‌ : భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న నాలుగో టెస్టుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం అతిథ్య ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌ మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌ను భారత్‌, ఆస్ట్రేలియా ప్రధానులు నరేంద్ర మోడీ, ఆంథోనీ అల్బనీస్‌లు మైదానానికి వచ్చి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ప్రధానులిద్దరూ తొలి రోజు ఆటను చూసేందుకు స్టేడియంకు రానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా తొలి రోజు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించకూడదని గుజరాత్‌ క్రికెట్‌ ఆసోసియేషన్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులోనే భాగంగానే తొలి రోజు టికెట్స్‌ను గుజరాత్‌ క్రికెట్‌ ఆసోసియేషన్‌ ఆన్‌లైన్‌లో బ్లాక్‌ చేసింది. మొదటి రోజు మినహా మిగితా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.
కాగా సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లు రసవత్తరంగా సాగాయి. 2-1 తేడాతో ఆధిక్యంతో భారత జట్టు ముందుంది. తొలి రెండు టెస్టుల్లో గెలిచినా.. మూడో టెస్టులో ఓడిపోయింది. చివరి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను చేజిక్కించుకోవాలని, తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌ షిప్‌ ఫైనల్లోకి అడుగుపెట్టాలని భావిస్తోంది