ఢాకా: ఐసిసి వన్డే ప్రపంచకప్-2023కు దక్షిణాఫ్రికా జట్టు అర్హత సాధించింది. ఐర్లాండ్-బంగ్లా మధ్య జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కావడంతో దక్షిణాఫ్రికా జట్టు నేరుగా అర్హత సాధించింది. ఇక ఐర్లాండ్ వన్డే వరల్డ్ కప్పులో పాల్గొనాలంటే అర్హత మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ముష్ఫీకర్ రహీమ్(61) అర్ధశతకం సాధించాడు. శాంటో, షకీబ్, మిరాజ్ రాణించారు. ఈ సిరీస్ కోసం ఐపీఎల్ నుంచి వచ్చిన జోషువా లిటిల్ మూడు వికెట్లు తీశాడు. మార్క్ అడైర్, హ్యూమ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్య చేధనలో బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌కు శుభారంభం దక్కలేదు. 16.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 65 చేసింది. అదే సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్ నిలిపేశారు. అయితే వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఐర్లాండ్ 3-0తో గెలిస్తే.. ఆ జట్టు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించేది. తొలి వన్డే వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోవడంతో దక్షిణాఫ్రికాకు ప్రపంచకప్ బెర్త్ దక్కింది.










