రావల్పిండి: ఐదు టి20ల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన చివరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఇరుజట్ల మధ్య జరిగిన ఐదు టి20ల సిరీస్ 2-2తో సమంగా కాగా.. నాల్గో టి20 వర్షం కారణంగా రద్దయ్యింది. సోమవారం జరిగిన చివరి, ఐదో టి20లో టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 193పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. రిజ్వాన్(98), ఇఫ్తికార్ అహ్మద్(36), ఇమాద్ వాసింగ్(31) బ్యాటింగ్‌లో రాణించగా.. కెప్టెన్ బాబర్ అజామ్(19), మహ్మద్ హర్రీస్, సైమ్ అయూబ్ డకౌట్లయ్యారు. టిక్నర్‌కు మూడు, ఇష్ సోథీకి ఒక వికెట్ దక్కాయి. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ జట్టు 26పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మిఛెల్(15) కూడా నిరాశపరిచాడు. ఆ దశలో మార్క్ ఛాప్మన్(104నాటౌట్; 57బంతుల్లో 11ఫోర్లు, 4సిక్సర్లు), నీషమ్(45నాటౌట్; 25బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. న్యూజిలాండ్ జట్టు 10ఓవర్లలో 73పరుగులు చేసినా.. చివరి 60బంతుల్లో 120పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించారు. షాహిన్ షా, ఇమాద్ వాసింకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ మార్క్ ఛాప్మన్‌కు లభించింది. ఇరుజట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ 27(గురు)నుంచి ప్రారంభం కానుంది.











