టాలీవుడ్లో గత కొంత కాలంగా చిన్న సినిమాలు, చిన్న హీరోల హవా నడుస్తోంది. ట్రెండ్‌కు తగ్గట్టుగా కథలను ఎంచుకుంటూ చిన్న హీరోలు భారీ హిట్లను సొంతం చేసుకుంటున్నారు. అంతేకాదు భారీగా అభిమానులనూ సంపాదించుకుంటున్నారు. అలాంటి హీరోల్లో ఒకరు సంతోష్ శోభన్. వైవిధ్యమైన కమర్షియల్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూ, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా 'లైక్ షేర్ సబ్‌స్క్రైబ్' చిత్రం విజయం సాధించిన సందర్భంగా ఆయన గురించిన మరిన్ని విశేషాలు..
సంతోష్ శోభన్ భారతీయ చలనచిత్ర నటుడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రధానంగా పనిచేస్తున్నారు. గోల్కొండ హైస్కూల్ చిత్రంతో తెరంగేట్రం చేసిన సంతోష్.. 'తను నేను' చిత్రంతో కథానాయకుడిగా అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే ప్రతిభ గల నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రతిభావంతుడైన యువ హీరోగా అందరి మెప్పు పొందడం సంతోష్ శోభన్కున్న అడ్వాంటేజ్. పేపర్ బారుతో క్రిటికల్ అక్లైమ్ తెచ్చుకుని, 'ఏక్ మినీ కథ, మంచిరోజులు' వచ్చాయి సినిమాలతో కమర్షియల్ హిట్స్ అందుకున్నారు. ఇటీవల 'లైక్ షేర్ సబ్ స్క్రైబ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంతోష్ శోభన్.. మరోసారి డిఫరెంట్ అటెంప్ట్ చేశారనే పేరు తెచ్చుకున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన 'లైక్ షేర్ సబ్‌స్క్రైబ్' చిత్రాన్ని వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్ టైన్మెంట్తో కలిసి ఆముక్త క్రియేషన్స్‌లో నిర్మించారు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించారు. తాజాగా నిర్వహించిన ఓ సమావేశంలో హీరో సంతోష్ శోభన్ చిత్ర విశేషాలని పంచుకున్నారు.
అందుకే ఈ సినిమా చేశాం..
'కథ బాగా నచ్చింది. దర్శకుడు మేర్లపాక గాంధీ అంటే ఇష్టం. ఆయన కథతో 'ఏక్ మినీ కథ' చేశాను. ఆయనతో ఒక బాండింగ్ వుంది. ఆయన టైమింగ్ తెలుసు. 'ఏక్ మినీ కథ' తర్వాతే మళ్లీ వర్క్ చేయాలని అనుకున్నాం. లక్కీగా తొందరగా అయిపోయింది. కథ చెప్పిన
నెల రోజుల్లోనే షూటింగ్‌కి వెళ్లిపోయాం. ఆయన కూడా నన్ను నమ్మారు. ఈ విషయంలో చాలా ఆనందంగా వుంది. మనస్పూర్తిగా నవ్వుకొని, నవ్విస్తూ చేసిన సినిమా ఇది. అలాగే నా ఫేవరేట్ క్యారెక్టర్ ఇది. ఈ కథకు నేనే ఫస్ట్ ఛాయిస్ అని దర్శకులు చెప్పారు. ఆయన మాటని నమ్ముతున్నాను. కెరీర్లో మొదటిసారి నా ఏజ్ పాత్రలో చేస్తున్నా. నా మనసుకు చాలా నచ్చింది. ఎక్స్ ప్రెస్ రాజా లా హైపర్ ఎనర్జిటిక్ క్యారెక్టర్. చాలా ఇంటరెస్టింగ్‌గా వుంటుంది. నిజానికి సోషల్ మీడియాలో నేను కొంచెం వెనుకబడి వున్నాను. యూట్యూబ్ అందరికీ తెలుసు. మారేడుమిల్లి ఫారెస్ట్‌లో షూటింగ్ చేసినప్పుడు అక్కడ యూట్యూబ్ వ్లాగ్ చేసే కుర్రాళ్లు వున్నారు. మనం ఎక్కడో వెదుకుతాం కానీ మన చూట్టునే బోలెడు ఆసక్తికరమైన కథలు వున్నాయి' అని తెలిపారు.
నాన్న గురించి చెబుతూ.. నవ్వుతూ పలకరిస్తారు..
'నేను సినిమా పరిశ్రమకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకూ నాకు ఎదురైన వారంతా నాన్న (దర్శకుడు శోభన్) గురించి ఒక మంచిమాట చెప్పేవారు. నవ్వుతూ పలకరించేవారు. ఇది నా అదృష్టం. నేను మరింత కష్టపడి చేస్తాను. నాన్న వెళ్లిపోయి 14 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ నా చుట్టూ వున్న వాళ్లంతా ఆయన గురించి చెబుతూ, నవ్వుతూ పలకరిస్తున్నారంటే వారి రూపంలో నాన్న నాతో ఉన్నట్టే. నా కెరీర్ ఇప్పుడే మొదలైయింది. ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి. నటుడు కావాలని కల కన్నాను. అయ్యాను. ఇప్పుడు మరింతగా కష్టపడి, మంచి సినిమాలు చేయాలి' అని చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో ఉద్వేగానికి లోనయ్యా..
తాజాగా సంతోష్ శోభన్ సోషల్ మీడియా ద్వారా భావోద్వేగ పోస్ట్ చేశారు. అందులో ఆయన స్పందిస్తూ.. 'నేను 2010లో తొలిసారి కెమెరా ముందుకొచ్చాను. నా ఫేవరేట్ డైరెక్టర్ ఇంద్రగంటి దర్శకత్వంలో 'గోల్కొండ హైస్కూల్' చిత్రంలో నటించాను. ఈ సినిమాలో నా డైలాగ్స్ చెప్పినప్పుడు ఉద్వేగానికి లోనయ్యాను. నేను నా కలను సాకారం చేసుకున్న అనుభూతి కలిగింది. ఇక అప్పటి నుంచి నేను ఎప్పుడు కెమెరా ముందుకొచ్చినా నా డ్రీమ్‌ను ఫుల్ ఫిల్ చేసుకుంటున్నానని ఆనందపడుతుంటా. ఇదే ఆనందాన్ని నిత్యం పొందేందుకు మంచి కథల్లో నటిస్తూ, మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయాలనుకుంటున్నాను. నా లేటెస్ట్ మూవీ 'లైక్ షేర్ సబ్‌స్క్రైబ్'కు మీరు చూపించిన ఆదరణ, మా వెంట మీరున్నారనే ధైర్యాన్నిచ్చింది. నా సోదరుడు దర్శకుడు మేర్లపాక గాంధీ, నాయిక ఫరియా అబ్దుల్లా, బ్రహ్మాజీ, ఇతర కాస్ట్ అండ్ క్రూ అందరికీ నా కృతజ్ఞతలు' అని చెప్పారు.
కాగా సంతోష్ శోభన్ ప్రస్తుతం 'ప్రేమ్ కుమార్' అనే సినిమాతో పాటు యూవీ క్రియేషన్స్‌లో రెండు ప్రాజెక్ట్స్‌లకు ప్లానింగ్ జరుగుతోంది. ఒక సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని, రిలీజ్‌కు రెడీగా ఉండగా, మరో సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే స్వప్న సినిమా పతాకంపై ప్రియాంక దత్ నిర్మాణంలో నందినీరెడ్డి దర్శకత్వంలో 'అన్నీ మంచి శకునములే' అనే సినిమాలోనూ సంతోష్ శోభన్ నటిస్తున్నారు.
పేరు : సంతోష్ శోభన్
పుట్టిన తేదీ : జూన్ 22, 1996
పుట్టిన ప్రాంతం : హైదరాబాద్
చదువు : థియేటర్ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్
తల్లిదండ్రులు : శోభన్ (దర్శకుడు), సౌజన్య
తోబుట్టువులు : సంగీత్ శోభన్
హాబీస్ : క్రెకెట్