Sep 17,2022 11:46

ముంబయి : న్యూజిలాండ్‌-ఏతో మూడు వన్డేల సిరీస్‌కు సంజు శాంసన్‌ సారథ్యం వహించ నున్నాడు. ఇరుజట్ల మధ్య అనధికారిక టెస్ట్‌ సిరీస్‌ ముగిసిన అనతరం వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. టెస్ట్‌ సిరీస్‌లో ఆడిన పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్‌, రాహుల్‌ త్రిపాఠి, రజత్‌ పటీధర్‌ తమ తమ స్థానాలను సుస్థిరం చేసుకోగా.. యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మకు మరోసారి అవకాశం దక్కింది. ఆల్‌రౌండర్‌ రాజ్‌ అగద్‌ బవాకు తొలిసారి వన్డేల్లో చోటు లభించింది. రాజ్‌ బవా భారత అడర్‌-19 జట్టు ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో ఓ సభ్యుడు. ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడిన అనుభవముంది. పేస్‌ బౌలింగ్‌ను శార్దూల్‌, కుల్దీప్‌ సేన్‌, ఉమ్రన్‌ మాలిక్‌, నవ్‌దీప్‌ సైనీ తమ భుజాలపై మోయనుండగా.. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్‌ యాదవ్‌, షాబాజ్‌ అహ్మద్‌, రాహుల్‌ చాహర్‌ రూపంలో జట్టులో ఉన్నారు. స్టాండ్‌బై కీపర్‌గా కెఎస్‌ భరత్‌ కొనసాగనున్నారు. దినేశ్‌ కార్తీక్‌, రిషబ్‌ పంత్‌ టి20 ప్రపంచకప్‌కు టీమిండియా జట్టులో సంపాదించుకోవడంతో సంజుకు కెప్టెన్సీ అవకాశం దక్కింది. చెన్నై వేదికగా 22, 25, 27న మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది.
జట్టు: సంజు(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), కెఎస్‌ భరత్‌, పృథ్వీ షా, అభిమన్యు, గైక్వాడ్‌, త్రిపాఠి, పటీధర్‌, కుల్దీప్‌, షాబాజ్‌, చాహర్‌, తిలక్‌ వర్మ, కుల్దీప్‌ సేన్‌, శార్దూల్‌, ఉమ్రన్‌, సైనీ, రాజ్‌ బవా.