Aug 29,2023 21:36
  • నాగార్జున యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌
  • ప్రముఖ పాత్రికేయులు సాయినాథ్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం

ప్రజాశక్తి- ఎఎన్‌యు (గుంటూరు జిల్లా) : యువతే భవిష్యత్తు నిర్మాతలని రాష్ట్ర గవర్నర్‌, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ కులపతి జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ 39వ, 40వ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ప్రముఖ పాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్‌కు గౌరవ డాక్టరేట్‌ను యూనివర్సిటీ తరుఫున రాష్ట్ర గవర్నర్‌ ప్రదానం చేశారు. విద్యార్థులకు డాక్టరేట్లు, పిహెచ్‌డి, ఎంఫిల్‌ పట్టాలు, బంగారు పతకాలు, డిగ్రీలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ మాట్లాడుతూ ప్రపంచ దేశాలు అనుసంధానం జరుగుతున్న నేటి విప్లవాత్మక పరిణామ క్రమంలో శాస్త్ర, సాంకేతిక, పరిశోధనా రంగాల్లో యువత కృషి అమోఘమని అన్నారు. అభివృద్ధి వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలకు వారే మార్గదర్శకమని పేర్కొన్నారు.
పాలగుమ్మి సాయినాథ్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు గొప్ప భాషా వారసత్వ చరిత్ర ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ సంక్షోభం తలెత్తినప్పుడు అప్పటి వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం జయతీఘోష్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేసిందన్నారు. తాను గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా అధ్యయనం చేయడం వల్ల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని, తాను జర్నలిస్టుగా వ్యవసాయ రంగం, గ్రామీణ పరిస్థితుల గురించి ఎక్కువగా అధ్యయనం చేశానని తెలిపారు. యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ వి.రాజశేఖర్‌ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో రెక్టార్‌ ప్రొఫెసర్‌ వరప్రసాద్‌మూర్తి, రిజిస్ట్రార్‌ బి.కరుణ, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌, అకడమిక్‌ సెనేట్‌ సభ్యులు, యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు.