- ప్రతి కుటుంబానికీ రెండు ఎకరాల సాగు భూమి ఇవ్వాలి
- రాష్ట్ర భూ సదస్సులో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు బి. వెంకట్
ప్రజాశక్తి -పెనుకొండ (శ్రీ సత్యసాయి జిల్లా):కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ల కొమ్ము కాస్తున్నాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్ విమర్శించారు. శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండలో సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర భూ సదస్సు నిర్వహించారు. తొలుత పట్టణ పురవీధుల్లో భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ అధ్యక్షతన పేదలకు భూమి, ఇల్లు కోసం రాష్ట్ర సదస్సు నిర్వహించారు. సదస్సులో బి.వెంకట్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు పేదలకు సాగు భూములు పంచడంలో పూర్తి విఫలమయ్యాయన్నారు. భూములు ఇస్తారా? లేక దున్నుకోమంటారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. సెజ్‌ల పేరుతో భూములను తీసుకుంటూ పేదలకు భూముల్లేకుండా చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధికి, పరిశ్రమల ఏర్పాటుకు సిపిఎం వ్యతిరేకం కాదన్నారు. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందని, పెత్తందారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాలతోపాటు ఇంటి నిర్మాణానికి సంబంధించి కేంద్రం రూ.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు మొత్తం రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేరళలో ఎర్రజెండా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి రూ 7,40,000 ఇస్తోందన్నారు. కేరళలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 13 రకాల వస్తువులను పంపిణీ చేస్తున్నారని, మన రాష్ట్రంలోనూ ఇలాగే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు భూ పంపిణీ జరిగేంత వరకు ఇళ్ల స్థలాలు దక్కేంతవరకు సిపిఎం వారికి అండగా ఉండి పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కర్ణాటక రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ముణి వెంకటప్ప, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. ప్రభాకర్ రెడ్డి, వి. రాంభూపాల్, రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పాల్గొన్నారు.










