- ఎస్‌ఐపిబి సమావేశంలో సిఎం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : గ్రీన్ ఎనర్జీరంగంలో రాష్ట్రానికి రూ.81 వేల కోట్ల పెట్టుబడులు త్వరలో రాష్ట్రానికి రానున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్‌ఐపిబి) సమావేశం సిఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చనున్నాయని అన్నారు. భారీ ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతుందని వివరించారు. ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుందని, ఎనర్జీలో దేశానికి ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు. రైతులకు పెద్దగా ఆదాయం రాని భూముల్లో ఎడాదికి ఎకరానికి రూ.30 వేల వరకూ లీజు కింద డబ్బు వస్తుందని, దీంతో రైతుల ఆదాయం పెరుగుతుందని వివరించారు. పరిశ్రమల ఏర్పాటు, వాటి నిర్వహణ తదితర వాటికోసం పెద్దఎత్తున ఏర్పాటయ్యే సంస్థల వల్ల నైపుణ్యాభివృద్ధి పెరుగుతుందన్నారు. . 'కొప్పర్తిలో కాసిన్ ఇ మొబిలిటీ ప్రైవేటు లిమిటెడ్‌కు రూ.386.23 కోట్లు పెట్టుబడులు రానున్నాయి. వీటిల్లో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కోసం రూ.286.23, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు రూ.100 కోట్లు రానున్నాయి. తొలిదశలో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వేయి ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేయాలన్నది లక్ష్యం' అని ముఖ్యమంత్రి చెప్పారు. కాకినాడ సెజ్‌లో లైఫిజ్ ఫార్మా రూ1900 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని, 2024 నాటికి కంపెనీ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టనున్నారు. దీనికోసం 236.37 ఎకరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా రామయపట్నంలో మెలటార్జికల్‌గ్రేడ్ సిలికాన్, పాలీసిలికాన్, ఫ్లోట్, రోల్డ్‌గ్లాసెస్ వంటి వాటి తయారీ కోసం పరిశ్రమతోపాటు సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఇండోసోల్ సోలార్ ప్రైవేటు లిమిటెడ్ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. దీనికోసం మూడు దశల్లో మొత్తం రూ.43,143 కోట్ల పెట్టుబడులు పెడతారన్నారు. 5,147 ఎకరాల్లో తయారీ పరిశ్రమ 60 గిగివాట్ల విద్యుత్ పరిశ్రమను ఏర్పాటు చేస్తారన్నారు. కృష్ణాజిల్లా మల్లవల్లిలో అవిశా ఫుడ్ ప్రైవేటు లిమిటెడ్ రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టనుందని అన్నారు. ఆరు గ్రీన్ ఏనర్జీ ప్రాజెక్టుల కోసం రూ.81,043 కోట్ల పెట్టుబడులు రావవడంతోపాటు 20,130 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. అదే విధంగా వైఎస్‌ఆర్ జిల్లా వొంగిమల్ల వద్ద 1800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంటును 8,240 కోట్ల రూపాయలతో ఆస్తా గ్రీన్ ఏనర్జీ వెంచర్స్ ప్రైవేటు లిమిటెడ్ ఏర్పాటు చేయనుందని చెప్పారు. సోమశిల, ఎర్రవరం వద్ద ఏర్పాటు చేయనున్న ప్లాంట్లలో రూ.8,855 కోట్లు, అవుకు, సింగనమల వద్ద ఏర్పాటు చేయనున్న హైడ్రో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు ఎస్‌ఐపిబి ఆమోదం తెలిపింది. సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం అరబిందో రియాల్టీ, ఇన్‌్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ.6315కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. వైఎస్‌ఆర్ జిల్లా పైడిపాలెం వద్ద రూ.33,033 కోట్లు, నంధ్యాల జిల్లాలో సోలార్, విండ్, పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్న ఎఎం గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రూ.5000 కోట్లు, గ్రీన్‌కో రూ.19,600 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ సమావేశానికి మంత్రులు బూడి ముత్యాలనాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంధ్రనాథ్, గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరామ్, సిఎస్ సమీర్‌శర్మ తదితరులు హాజరయ్యారు.










