- 26 కేజీ బస్తాకు రూ.150 నుంచి రూ.200 పెంపు
- ప్రజలు బెంబేలు -చక్రం తిప్పుతున్న బియ్యం వ్యాపారుల 'సిండికేట్'
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : బియ్యం ధరలు రోజురోజుకూ ఎగబాకుతున్నాయి. పదేళ్లలో ఎన్నడూ లేనంతగా గరిష్ట ధరలు పలుకుతుండటంతో పేదలకు కష్టాలు తప్పడం లేదు. ప్రధానంగా సన్నాలు పెరుగుతున్నాయి. చిల్లర దుకాణాల్లో వీటి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. హోల్‌సెల్ మార్కెట్లో 26 కిలోల బస్తా రూ.1,560కు చేరింది. గతంలో రూ.1,250 లభించేది. కరోనా ముందు నుంచి పాత బియ్యం ధర చాలాకాలంగా కిలో రూ.48గా ఉంది. గతేడాది డిసెంబరు నుంచి ధర పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం 'ఎ' గ్రేడ్ సన్నాలు రకం కిలో రూ.60 ఉంది. ఆ తర్వాతి రకాలు కిలో రూ.54గా ఉన్నాయి.
పాత బియ్యానికి డిమాండ్
పాత బియ్యానికి డిమాండ్ పెరిగింది. దీంతో, కొందరు మిల్లర్లు ఆవిరితో మరపట్టించిన బియ్యాన్ని పాతబియ్యంతో కలిపి విక్రయిస్తున్నారు. ఒకే రకమైన బియ్యాన్ని వివిధ బ్రాండ్ల పేరుతో ఆకర్షణీయమైన సంచుల్లో నింపి ధరలు పెంచి విక్రయిస్తున్నారు. బియ్యం విక్రయిస్తున్న కంపెనీలు పన్నుల నుంచి ఉపశమనం పొందడానికి 26 కిలోలు, 30 కిలోల బస్తాలను అందుబాటులోకి తెచ్చాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 25 కిలోలు దాటితే పన్ను ఉండదు. ఈ దృష్ట్యా వ్యాపారులు 26 కిలోల బస్తాలను విక్రయిస్తున్నారు.
రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు
ప్రభుత్వం ఆర్‌బికెల ద్వారా రైౖతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తోంది. నిబంధనల కోర్రీతో రైతులు ఆర్‌బికెల్లో వీటిని విక్రయించలేకపోతున్నారు. ఫలితంగా వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరకంటే రూ.200 నుంచి రూ.300 తక్కువకే ధాన్యాన్ని రైతుల నుంచి వారు కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన ధాన్యం మిల్లింగ్ చేస్తే 80 కేజీల బస్తాకు సుమారు 57 కేజీల నుంచి 60 కేజీల వరకు బియ్యం వస్తాయి. మిల్లింగ్ కోసం మిల్లర్లకు సుమారు రూ.150 ఖర్చవుతోంది. మిల్లు మెయింటెనెన్స్‌కు ఊక, తవుడు, నూకలు సరిపోతాయి. మొత్తంగా 80 కేజీల ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి మిల్లర్‌కు సుమారు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకూ ఖర్చవుతోంది. దిగుబడి 57 కేజీలు వస్తోంది. కిలో రూ.60 చొప్పున రూ.3,420కు విక్రయిస్తుండడంతో మిల్లర్‌కు రూ.900పైగా లాభం చేకూరుతోంది.
రేషన్ బియ్యాన్ని ఇలా...
మరికొందరు మిల్లర్లు మరో అడుగు ముందుకేసి రేషన్ బియ్యాన్ని ప్రజల నుంచి కేజీ రూ.13 నుంచి రూ.15 కొనుగోలు చేస్తున్నారు. మిల్లింగ్ చేసే సమయంలో సన్న బియ్యంలో 20 శాతం వరకు వీటిని కలిపేస్తున్నారు. వీటినే బ్రాండెండ్ పేరిట ప్యాకింగ్ చేసి అధిక ధరకు విక్రయిస్తున్నారు.
అక్రమల నిల్వలే కారణమా ?
గతేడాది వర్షం వల్ల ధాన్యం దెబ్బతిందని, నిల్వలు లేవని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో పండిన సన్నరకాల ధాన్యంలో 55 శాతం వరకు వరకూ మాత్రమే ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యాయి. మిగిలిన ధాన్యం వ్యాపారుల వద్దే ఉంది. దీంతో, బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ఉమ్మడి జిల్లాల్లో వ్యాపారులు పెద ్దఎత్తున నిల్వ చేసిన ధాన్యాన్ని మార్కెట్లోకి తీసుకురాగలిగితే ధరలు అదుపు చేయవచ్చు. జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బియ్యం నిల్వలపై కంట్రోల్ అథారిటీ లేదు
బియ్యం నిల్వలపై కంట్రోల్ అథారిటీ లేదు. నిత్యావసరాలు ఫ్రీ ట్రేడ్ చేయాలనే ఉద్దేశంతో ఐదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించింది. గతంలో రిటైల్ షాపుల్లో 20 క్వింటాళ్లు మాత్రమే నిల్వ చేయాలనే పరిమితి ఉండేది. ఓపెన్ మార్కెట్లో డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా లేకపోవటంతో ధరలు పెరగడం సాధారణమే. ఆ నేపథ్యంలోనే ధరలు పెరిగాయి.
- ప్రసాదరావు, పౌరసరఫరాల శాఖాధికారి, తూర్పుగోదావరి జిల్లా










