ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో సెల్‌ఫోన్‌లు, కెమెరాలను సభ్యులు సభలోకి తీసుకురాకుండా బాధ్యత గల వ్యక్తి వద్ద ఎంట్రన్స్‌లోనే డిపాజిట్ చేసుకునే సిస్టమ్‌ను తేవాలనుకుంటున్నామని శాసనసభ స్పీకరు తమ్మినేని సీతారాం వెల్లడించారు. ప్రతిపక్ష సభ్యులు సభలో ఆందోళన చేస్తున్న సమయంలో వీడియోలు తీస్తున్నారని, సభ్యులు సెల్‌ఫోన్లు లోపలికి తీసుకురావచ్చా? లేదా? ఒక వేళ తెస్తే వీడియోలు తీయొచ్చా? అనే అంశాలపై రూలింగ్ ఇవ్వాలని స్పీకరుకు మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. రూల్స్ ఆఫ్ కండెక్ట్ బిజినెస్‌లో కూడా సభలోకి సెల్స్ తీసుకురాకూడదని స్పష్టంగా ఉందని స్పీకరు తెలిపారు. సభ్యులకిచ్చే బులెటెన్‌లో కూడా ఈ అంశాన్ని పేర్కొంటే సభ్యులందరికీ ఈ విషయం తెలుస్తుందని మంత్రి బొత్స పేర్కొన్నారు. గురువారం సభలో వీడియోలు తీసిన వారిని సస్పెండ్ చేశామని, కమిటీకి సిఫార్సు చేస్తామని స్పీకరు తెలిపారు.










