ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం):గడిచిన నాలుగున్నరేళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలు బాగా వెనుకబడిపోయాయని, విశాఖపట్నానికి మకాం మార్చితే ఉత్తరాంధ్ర అభివృద్ధి అవుతుందని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ప్రజలకు తాగు, సాగునీరు కోసం తలపెట్టిన సుజల స్రవంతి ప్రాజెక్టు పనుల కోసం ఎంత నిధులు కేటాయించారో, రైతులకు ఏం మేలు చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలో కో-ఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీలు, ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలు, జ్యూట్ పరిశ్రమలు మూతపడడానికి కారణం వైసిపి ప్రభుత్వ విధానాలు కాదా? అని ప్రశ్నించారు. మూతపడిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలను తెరిపించడానికి ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఆంధ్ర రాష్ట్రానికే తలమానికమైన విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. 974 రోజులుగా జరుగుతున్న ఉక్కు పరిరక్షణ ఉద్యమం కనబడలేదా? అని నిలదీశారు. గంగవరం పోర్టును అదానీకి ఎందుకు కట్టబెట్టారో? విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రావాల్సిన ముడిసరుకును ఎందుకు ఆపించేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఉమ్మడి విశాఖపట్నం ఏజెన్సీలో ఆదిమ తెగ ఉందని, వారు బాగా వెనుకబడినవారని, వారి కోసమే తాను విశాఖపట్నానికి మకాం మార్చుతున్నానని తాజాగా విడుదల చేసిన జిఒలో సిఎం పేర్కొనడాన్ని లోకనాథం ప్రస్తావించారు. గిరిజన ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. గిరిజనులకు అంత్యోదయ కార్డుల ద్వారా ఇచ్చే రేషన్‌ను ఎందుకు నిలుపుదల చేశారని, ఎంతమంది గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని ప్రశ్నించారు. ల్యాండ్‌పూలింగ్ ద్వారా 6,116 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారని తెలిపారు. విశాఖకు రైల్వే జోన్, వాల్తేరు డివిజన్, మెట్రో రైలు, గిరిజన యూనివర్సిటీ వంటి విభజన హామీలు, వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్రం నుంచి ఏటా రావాల్సిన రూ.50 కోట్ల నిధుల కోసం ఏ ప్రయత్నం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రశ్నలకు సిఎం సమాధానం చెప్పాలన్నారు. ఉత్తరాంధ్రలో కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకోవడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే సిఎం విశాఖకు మకాం మారుస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర వెనుకబడింది తప్ప, ఉత్తరాంధ్రలోని రాజకీయ పార్టీల నాయకులు వెనుకబడలేదని లోకనాథం పేర్కొన్నారు. సిఎం క్యాంపు ఆఫీసు వచ్చినంత మాత్రాన అభివృద్ధి జరగదన్నారు. పైగా, చిరువ్యాపారులు, అసంఘటితరంగ కార్మికుల ఉపాధిపోయే ప్రమాదముందని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, నిధులు మంజూరు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థలను రక్షించడంతోపాటు ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, జిల్లా కమిటీ సభ్యులు కృష్ణారావు పాల్గొన్నారు.










