Jan 25,2023 20:19
  • అస్సాంతో రంజీట్రోఫీ మ్యాచ్‌

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : అస్సాంతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు గెలుపుదిశగా దూసుకెళ్తోంది. జట్టుకు భారీ ఆధిక్యత లభించింది. విజయనగరం సమీపంలోని చింతలవలస వద్దనున్న పివిజి రాజు ఎసిఎ స్పోర్ట్స్‌ కాంప్లెక్సులో నిర్వహిస్తున్న రంజీమ్యాచ్‌లో ఆంధ్రా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 361 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో అస్సాం 113పరుగులే చేయడంతో ఆంధ్రకు 248 పరుగుల ఆధిక్యతను సంపాదించింది. అభిషేక్‌ రెడ్డి(75), కెప్టెన్‌ హనుమ విహారి(80), కరణ్‌ షిండే(90) అర్ధసెంచరీలతో రాణించారు. అస్సాం బౌలర్‌ పుర్కాయస్థ నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అస్సాం జట్టు రెండో రోజు బుధవారం అట ముగిసే సమయానికి ఐదు వికెట్లు నష్టపోయి 62 పరుగులు చేసింది. లలిత్‌కు రెండు, షోయబ్‌, మాధవ్‌ రాయుడుకు ఒక్కో వికెట్‌ దక్కాయి. అస్సాం జట్టు ఇంకా 186 పరుగులు వెనుకబడి ఉంది.

  • హైదరాబాద్‌ 355ఆలౌట్‌

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఢిల్లీతో జరుగుతున్న రంజీమ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 355పరుగులకు ఆలౌటైంది. రోహిత్‌ రాయుడు(153), చందన్‌(67) బ్యాటింగ్‌లో రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఢిల్లీ జట్టు రెండోరోజు ఆట నిలిచే సమయానికి 5వికెట్లు నష్టపోయి 223పరుగులు చేసింది. ఓపెనర్‌, కెప్టెన్‌ యశ్‌ ధుల్‌(72), ఆయుష్‌ బడోని(78నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించారు. లలిత్‌ మోహన్‌(7) క్రీజ్‌లో ఉన్నాడు. అజరు, అంకిత్‌రెడ్డికి రెండేసి వికెట్లు దక్కాయి.