- వంశధార ప్రాజెక్టుతో సర్వం కోల్పోయాం
ప్రజాశక్తి - యంత్రాంగం : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సిపిఎం చేపట్టిన 'ఇంటింటికి సిపిఎం.. జనం కోసం సిపిఎం' కార్యక్రమంలో ప్రజలు పలు సమస్యలను సిపిఎం నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఒకే ఇంట్లో నాలుగైదు కుటుంబాలు కలిసి ఉంటున్నామని, జగనన్న ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నా.. అనర్హులుగా చేర్చారని రాజ్యసభ మాజీ సభ్యులు, సిపిఎం నేత మధు, జిల్లా కార్యదర్శి పాశం రామారావు బృందం ఎదుట గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు గ్రామం దళితవాడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా..దళితుల బతుకుల్లో మార్పురాలేదని.. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళా ్తమని మధు తెలిపారు. విద్యుత్ బిల్లులు, అధిక ధరలపై పల్నాడు జిల్లా చిలకలూరిపేటనగర ప్రజలు తెలిపారు. 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమకు పట్టాలివ్వడం లేదని రాజుపాలెం మండలం కొండమోడు గ్రామస్తులు సిపిఎం నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఉచిత పథకాలు తమకొద్దని పెంచిన ధరలు తగ్గిస్తే చాలని కర్నూలులోని అల్లిషేర్ బాగ్ కాలనీ వాసులు తమ ఆవేదనను సిపిఎం నాయకుల ఎదుట వ్యక్తం చేశారు. బేతంచర్ల మండలం ఆర్‌ఎస్ రంగాపురంలో అండర్ గ్రౌండ్ నిర్మాణం చేపట్టి మ్యాన్ హోల్‌కు మూతలు పెట్టడం మరచిపోయారని వాపోయారు.
సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాం
వంశధార ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం గులుమూరు పంచాయతీ శాస్త్రులపేటలో ఉంటున్న పెద్ద సంకిలి నిర్వాసితులు తమ సమస్యలను సిపిఎం నేతల ఎదుట ఏకరువు పెట్టారు.. జాబ్‌కార్డులు మారిస్తే ప్యాకేజీ పోతుందన్న భయంతో మార్చుకోలేదని, దీంతో ఉపాధి పనులు లేక బతికేందుకు వలస పోతున్నామని గులు మూరు పంచాయతీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
నీళ్లు లేక అల్లాడుతున్నాం
తాగునీళ్లు లేక అల్లాడుతున్నామని ప్రకాశం త్రిపురాంతకం మండలం, రామసముద్రం గ్రామానికి చెందిన మహిళలు సిపిఎం నాయకుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ప్రజాప్రతినిధులు మారినా తమ గ్రామంలో నీటి సమస్యను మాత్రం పరిష్కరించడం లేదన్నారు.
మురుగునీటితో అవస్థలు
డ్రెయినేజీపై ఉన్న కల్వర్టు కుంగి మురుగునీరు ఇళ్లలోకి రావడంతో తాము అనారోగాల బారిన పడుతున్నా పట్టించుకున్న నాధుడే లేడని ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలోని వెలమపేట, దేవుడు మన్యం మహిళలు తమ సమస్యను సిపిఎం నాయకుల దృష్టికి తెచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం రామచంద్రపురంలో రోడ్లు, డ్రెయినేజీ, తాగునీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, అయినా పట్టించుకునే వారే లేరని గ్రామస్తులు వాపోయారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
నీటి ట్యాంకర్‌కు వెయ్యిరూపాయలు
నీటి ట్యాంకర్లకు ప్రతిరోజూ రూ.500 నుంచి రూ. 1000 ఖర్చు చేస్తున్నామని కడప జిల్లా బుగ్గవంక వాసులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.1.80లక్షల్లో ఇంటి నిర్మాణం సాధ్యం కావడం లేదని పలువురు లబ్ధిదారులు సిపిఎం నేతల ఎదుట వాపోయారు.
డబ్బులు కట్టించుకుని నేటికీ ఇళ్లు ఇవ్వలేదు
'టిడ్కో ఇళ్ల కోసం రూ.25 వేలు కట్టించుకున్నారు. పట్టాలిచ్చి నేటికీ ఇళ్లు ఇవ్వలేదు' అని విశాఖ నగరంలోని 63వ వార్డు కాకరలోవ వాసులు సిపిఎం బృందం ఎదుట వాపోయారు. తమ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కించాయిపుట్టు పంచాయతీ పాత ముంచంగిపుట్టు, కుమిడిపుట్టు గ్రామాల్లో రహదారులు, డ్రెయినేజీల సమస్య ఉన్నట్టు ప్రజలు తెలిపారు.
మౌలిక సదపాయాలు లేవు
విద్యుత్ కోతలు, నిత్యావసర ధరల పెరుగుదల, పింఛన్, ఇళ్ల స్థలాలపై నెల్లూరు వాసులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల్లో తాగునీరు, విద్యుత్ వంటి కనీస మౌలిక సదుపాయాల్లేక ఇబ్బందులు పడుతున్నామని పార్వతీపురం జిల్లా వెంకంపేట, అడ్డాపుశీల గ్రామస్తులు సిపిఎం నాయకుల వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. వెంకంపేట, అడ్డాపుశీల గ్రామాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బ రావమ్మ తదితరులు కరపత్రాలు పంపిణీ చేశారు. రోడ్లు, డ్రెనేజీలు, వీధిదీపాలు లేక ఇబ్బంది పడుతున్నామని, ఇళ్ల స్థలాల కేటాయింపులోనూ అన్యాయం జరుగుతోందని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం, కదిరి ప్రజలు సిపిఎం నాయకుల ఎదుట ఏకరువు పెట్టారు. టిటిడి అటవీ కార్మికులు, శ్రీవారి చిరు వ్యాపారుల సమస్యలను నేటికీ పరిష్కరించలేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతూరైన నారావారిపల్లి ప్రజలు సిపిఎం నేతల ఎదుట మొరపెట్టుకున్నారు. నారావారిపల్లి, రంగంపేట, శ్రీనివాస మంగాపురం, చంద్రగిరి ప్రాంతాల్లో ఇంటింటికీ సిపిఎం కరపత్రాలను పంపిణీ చేశారు. విజయవాడ వాంబే కాలనీ, సింగ్‌నగర్‌లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబురావు, డి రమాదేవి పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, కొద్దిపాటి వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని, కాలనీలో ఇల్లు కోల్పోయిన వారికి గతంలో పట్టాలు ఇచ్చారని, నేటికీ స్థలాలు అప్పగించ లేదని కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం భగత్ సింగ్ కాలనీ వాసులు సిపిఎం నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.










