Jun 28,2022 21:18

న్యూఢిల్లీ :  సైన్యంలో చేరి.. దేశానికి సేవ చేయాలన్నది తమ కల. ఆ కల కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటాం. ప్రభుత్వం అగ్నిపథ్‌ పేరుతో కేవలం నాలుగేళ్లకు నూతన రిక్రూట్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఇప్పుడు తమ భవిష్యత్తేంటని వాపోతున్నారు. వీరంతా సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సిఎపిఎఫ్‌) కింద ఎస్‌ఎస్‌సి జిడి 2018 కానిస్టేబుల్స్‌ నియామకాల కోసం ఏడాది నుండి శాంతియుతంగా ఆందోళన చేపడుతున్నారు. 2018 పరీక్షల్లో ఎంపికై సిఎపిఎఫ్‌ అపాయింట్‌మెంట్‌ కోసం వేచిచూస్తున్నారు. పారా మిలటరీ బలగాలలో కానిస్టేబుళ్ల నియామకం కోసం అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌లలో ఎస్‌ఎస్‌సి జిడి పరీక్ష ఒకటి. ఎస్‌ఎస్‌సి 2018-19 వార్షిక నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 52 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు.

మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో నివసించే విశాల్‌ లాంగ్డే... గత 500 రోజులుగా తన ఇంటికి వెళ్లలేదు. విశాల్‌ ఒక్కడే కాదు పలువురు యువతీ యువకులు వారి ఇళ్లకు వెళ్లి ఏడాదిపైనే కావస్తోంది. దివాలీ, హోలీ, ఇలా ఎన్నో పండుగలు వీధుల్లోనే గడిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబం నుండి డబ్బులు తీసుకోవడం లేదని, తమ చేతుల్లో దేశ జెండాను చూసిన కొందరు తమకు ఆహారం ఇస్తున్నారని, దాంతో అలాగే కడుపునింపుకుంటూ శాంతియుతంగా తమ నిరసన సాగిస్తున్నామని విశాల్‌ పేర్కొన్నారు. ఏడాదికి పైగా తాము వీధుల్లో పోరాటం సాగిస్తున్నామని... కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.

పలు రాష్ట్రాల నుండి వచ్చిన అభ్యర్థులు నాగ్‌పూర్‌లోని సంవిధాన్‌ చౌక్‌ వద్ద 72 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టామని.. దీంతో పలువురు ఆస్పత్రి పాలయ్యారని విద్యార్థులు తెలిపారు. అనారోగ్యం పాలైన విద్యార్థులను మోసుకుంటూ పదికిలోమీటర్లకు పైగా ర్యాలీగా వెళ్లామని.. ఆ ఫొటోలు కూడా మీడియాలో వైరల్‌ అయ్యాయని విశాల్‌ లాంగ్డే తెలిపారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద గతేడాది చేపట్టిన శాంతియుత నిరసన హింసాత్మక మారడంతో పోలీసుల లాఠీ దెబ్బలకు పలువురు ఆస్పత్రి పాలయ్యారని అన్నారు. ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం యువతపై పోలీసులను ప్రయోగించడం సరికాదంటూ ఈ నిరసనకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ పోస్ట్‌ చేశారని చెప్పారు. యువతులు ఈ ఆందోళనలో పాల్గొనడం  చాలాకష్టమని, అపరిశుభ్రత కారణంగా తన తోటి అభ్యర్థి ఆస్పత్రి పాలైందని చత్తీస్‌ఘర్‌కి చెందిన సీమా ధ్రువ్‌ తెలిపారు. ఒక్కోసారి మరుగుదొడ్లు సౌకర్యం కూడా ఉండదని, చాలా బాధాకరమని అన్నారు. చాలాసార్లు ఆందోళన విరమించి వెనక్కి వెళదామని అనిపించినా.. తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్నామని సీమా ఆవేదన వ్యక్తం చేశారు.

సెప్టెంబర్‌ 2020లో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద్‌ రారు రాజ్యసభలో సిఎపిఎఫ్‌లో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించిన సభ్యులు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారు. సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్‌) అత్యధికంగా 28,926 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సిఆర్‌పిఎఫ్‌)లో 26,506 ఖాళీలు, సెంట్రల్‌ ఇండిస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సిఐఎస్‌ఎఫ్‌) 23,906 ఖాళీలు, సశాస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బి)లో 18,643 ఖాళీలు, ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటిబిపి)లో 5,784, అస్సాం రైఫిల్స్‌లో 7,328 ఖాళీలు ఉన్నాయని అన్నారు. మొత్తంగా సిఎపిఎఫ్‌లో దాదాపు లక్షకు పైగా ఖాళీలు ఉన్నాయని, వీటిల్లో అత్యధిక భాగం కానిస్టేబుల్‌ గ్రేడ్‌వి ఉన్నాయని అన్నారు. కరోనా కారణంగా నియామకాలు నిలిచిపోయాయని సమాధానమిచ్చారు.

ఇన్ని పోస్టుల భర్తీ చేయాల్సివుండగా.. కేవలం 25,271 పోస్టులకు ఎస్‌ఎస్‌సి జిడి నోటిఫికేషన్‌ 2021 విడుదలైంది. వీటిలో పురుష అభ్యర్థులకు 22,424, మహిళా అభ్యర్థులకు 2,847 ఖాళీలు. 2018లో ప్రకటించిన 60,210 కన్నా సగానికి పైగా తక్కువ పోస్టులు. పరీక్షల్లో అర్హత సాధించినప్పటికీ 2018లో ఎంపికైన 4,295 మంది అభ్యర్థులకు ఎందుకు అపాయింట్‌ మెంట్‌ లెటర్‌ ఇవ్వలేదని వారు ప్రశ్నిస్తున్నారు. దాదాపు లక్షకు పైగా పోస్టులు ఖాళీ ఉండగా కేవలం 25 వేల ఉద్యోగాలు మాత్రమే ఎందుకు ప్రకటించారని ప్రశ్నిస్తున్నారు.

లక్ష పోస్టులు ఉండగా ఈ ఏడాది సిఎపిఎఫ్‌ కింద ప్రభుత్వం కేవలం 25 వేల ఉద్యోగాలు మాత్రమే ప్రకటించిందని అభ్యర్థులు పేర్కొన్నారు. పైగా ఈ పోస్టుల్లో నూతన పథకం అగ్నిపథ్‌ కింద నియమితులై, నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన వారికి రిజర్వేషన్‌ కల్పించిందని యాదవ్‌ పేర్కొన్నారు. అగ్నిపథ్‌ పథకం అమలైతే... తమ ఉపాధిపై తీవ్రమైన ప్రభావం పడనుందని మండిపడ్డారు.

15 మంది అభ్యర్థులతో కలిసి ఢిల్లీలోని గురుద్వారా షీస్‌గంజ్‌లో ఉంటున్న యాదవ్‌ మాట్లాడుతూ.. తమ సమస్యల గురించి పార్లమెంటులో ప్రశ్నించాలని ప్రతి నేతను కోరుతున్నామని అన్నారు. తాను నాగ్‌పూర్‌ నుండి ఢిల్లీకి వెళ్లలేకపోయానని, కానీ ఈ సమస్యపై సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని మరో దళిత అభ్యర్థి హితేష్‌ కుమార్‌ రాథోడ్‌ పేర్కొన్నారు. ఇటీవల ప్రకటించిన నూతన పథకంతో వయస్సు పరిధి దాటిపోవడంతో సైన్యంలో చేరాలన్న తన కల కలగానే మిగిలిపోయిందని వాపోయారు. సిఎపిఎఫ్‌కోసం యత్నించానని, కరోనాతో అది ఆగిపోయిందని అన్నారు. ఇప్పుడు స్నేహితులు, బంధువులకు ముఖం చూపించలేకపోతున్నానని, తమ భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని ఆవేదన వ్యక్తంచేశారు.