ఆస్ట్రేలియా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయం సాధించిన అనంతరం ఆ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫ్రాంచైజీ క్రికెట్ ఆడితే వచ్చే డబ్బు కంటే, ఆస్ట్రేలియా జట్టుకు ఆడడానికే తొలి ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశాడు. ఐపీఎల్ తరహా క్రికెట్ ఆడితే వచ్చే డబ్బును కోల్పోతున్నందుకు తానేమీ చింతించడంలేదని అన్నాడు. డబ్బు వస్తుంది, పోతుంది... కానీ ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆడే అవకాశమే అన్నింటికంటే గొప్పదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో ఆడడాన్ని తాను ఆస్వాదించానని, అలాగే పదేళ్ల కిందట యార్క్ షైర్ తరుపున కౌంటీ క్రికెట్ ఆడడాన్ని కూడా ఎంజారు చేశానని స్టార్క్ వెల్లడించాడు.










