ఇంటర్నెట్‌డెస్క్ : రంగుల కలయికనే హోలీ. ఈ పండుగను చిన్నారులు, పెద్దలు అందరూ సంతోషంగా జరుపుకుంటారు. అయితే హోలీరోజున ఉపయోగించే రంగుల్లో సింథటిక్ కలర్స్ కాకుండా సహజమైన హెర్బల్ రంగులను వాడితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. సింథటిక్ కలర్స్‌ని ఉపయోగించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సింథటిక్ రంగుల వల్ల.. హోలీ పండుగ తర్వాత చర్మ సంబంధిత సమస్యలు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని చండీఘర్‌కి చెందిన చర్మవ్యాధుల నిపుణులు డాక్టర్ వికాస్ శర్మ తెలిపారు. ప్రధానంగా ఈ రంగుల వల్ల అలర్జీలు, ఇన్ఫెక్షన్స్, చర్మవ్యాధులు, శ్వాస సమస్యలకు గురవుతారని డాక్టర్ వికాస్ అన్నారు.
- చలికాలం నుంచి వేసవి కాలానికి మారుతున్న సమయమిది. దీంతో వైరల్, ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా పెరుగుతాయి. సీజన్ మారడంతోపాటు, హోలీ పండుగ తర్వాత ఈ రంగుల వల్ల అనారోగ్యాలకు గురికావడం మరింత పెరిగే అవకాశముందని డాక్టర్ వికాస్ తెలిపారు.
- హోలీ పండుగలో రంగుల్ని ముఖంపై చల్లుతారు. ఇలా రంగులు ముఖంపై పూసుకోవడం వల్ల రంగుల సాంద్రత శ్వాసకోశాల్లోకి త్వరగా చొచ్చుకుపోయి.. శ్వాస సమస్యలకు దారితీస్తాయి. చిన్నారులు, గర్భిణీస్త్రీలు దీని ప్రభావానికి ఎక్కువగా గురవుతారు.
- డెర్మటైటిస్, బ్రోన్సియల్, ఆస్తమా ఉన్నవారు హోలీకి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా సింథటిక్ కలర్స్‌లో ఉపయోగించే రసాయనాలు, వాటి సాంద్రత వల్ల త్వరగా ఇన్ఫెక్షన్స్‌కి గురవుతారు. అలాగే సింథటిక్ రంగుల్లో వాడే రసాయనాల్లో అతి సూక్ష్మంగా ఉండే మైకా పౌడర్‌ను ఉపయోగిస్తారు. దీనివల్ల చర్మ సమస్యలు, స్కిన్ అలర్జీలు పెరిగే అవకాశముంది.
- హోలీ ఆడిన తర్వాత రంగులను వెంటనే కడిగేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే సన్ ప్రొటెక్షన్ క్రీమ్‌ను రాసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. సింథటిక్ కలర్స్‌ని కాకుండా హెర్బల్ కలర్స్‌ని ఉపయోగించడం మంచిదని డాక్టర్ వికాస్ సలహా ఇచ్చారు. కోవిడ్ అనంతరం కూడా చాలామంది ప్రజలు జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడుతున్నారు. ఇక సింథటిక్ కలర్స్ వల్ల కూడా జుట్టు రాలిపోయే ప్రమాదముంది. అందుకే చిన్నారులు, పెద్దలు, సున్నితమైన చర్మం కలవారు హోలీకి దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ హోలీ పండుగ జరుపుకున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ వికాస్ తెలిపారు.