Oct 12,2022 09:31

ప్రజాశక్తి - ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపట్టు మండలంలోని దారెల గ్రామానికి చెందిన చెండా మచ్చులమ్మ ఈ నెల కరెంటు బిల్లును చూసి అవాక్కయింది. మట్టితో నిర్మించుకున్న చిన్నపాటి పెంకుటిల్లులో ఆమె నివాసముంటోంది. రెండు విద్యుత్‌ బల్బులు మాత్రమే వాడుతోంది. టివి, ఫ్రిజ్‌ వంటివి ఏమీ లేవు. అయితే, అధిక యూనిట్లు కరెంట్‌ వాడుతున్నట్టు చూపించి తాజాగా రూ.12944 బిల్లును ఆమె చేతిలో విద్యుత్‌ శాఖ అధికారులు పెట్టారు. దీంతో ఆమె లబోదిబోమంటోంది. 'నేను రోజు కూలీని. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం మాది. ఇలా వేలకు వేలు బిల్లు వస్తే ఎలా కడతాం' అని బాధితురాలు వాపోతోంది. ఆరు నెలలుగా కరెంటు బిల్లు ఎక్కువగానే వస్తోందని, దీనిపై అధికారులకు పలుమార్ల తెలియజేశామని, వారి వద్దకు వెళ్లినప్పుడు వచ్చి చూస్తామని చెబుతున్నారే గాని సమస్యను మాత్రం పరిష్కరించడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కరెంట్‌ బిల్లు అధికంగా వస్తే ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని అధికారులు చెబుతున్నారని, దీంతో తమ కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురవుతోందని చెప్పింది. విద్యుత్‌ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తన సమస్యను పరిష్కరించాలని కోరుతోంది. కరెంట్‌ మీటర్‌లో ఏమైనా సమస్యలుంటే వెంటనే మార్చాలని విజ్ఞప్తి చేస్తోంది.