గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట : ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి
ప్రజాశక్తి -బి.కొత్తకోట (అన్నమయ్య) : గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నియోజవర్గంలోని పెద్దతిప్పసముద్రం మండలం, మడుమూరు సచివాలయ పరిధిలోని మడుమూరు, శ్రీనివాసరాయునిపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ... ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను సమర్ధవంతంగా అమలు చేయాలని, పేదలైన అర్హులందరికీ సకాలంలో అందాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను సులభంగా, వేగంగా పరిష్కరించడానికి గ్రామ సచివాలయాలు దోహదపడుతున్నాయన్నారు. ఇప్పటికే మండలంలో దాదాపు సిసి రోడ్లు, తాగునీటి ట్యాంకులు, మురుగనీటి కాలువల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ఇంకా అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో గిరిధర్ రెడ్డి, మడుమూరు సర్పంచ్ నాగరత్న భాస్కర్ నాయుడు, ఎంపీపీ మహమ్మద్, వైసిపి నియోజకవర్గం మహిళా కన్వీనర్ అనిత చక్రవర్తి, పులికల్లు సర్పంచి పూల గిరీష్, ఎంపీటీసీ సయ్యద్, మల్లెల మాజీ సర్పంచ్ వెంకట్, సచివాలయం కన్వీనర్ సిఆర్ చిన్నికృష్ణ, కిట్టి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అయూబ్ భాష, నక్క మహేష్, తదితరులు పాల్గొన్నారు.










