Dec 11,2022 13:39

తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త కొత్త హీరోలు పరిచయమవుతున్నారు. ముఖ్యంగా ఇతర చిత్ర పరిశ్రమల హీరోలు మొదట అనువాద చిత్రాలతో పరిచయమవుతూ తెలుగులో నేరుగా చిత్రాలు చేస్తున్నారు. తాజాగా అలా పరిచయమవుతున్న కథా నాయకుడే విష్ణు విశాల్‌. తమిళ చిత్రం ఎఫ్‌ఐఆర్‌తో తెలుగులో పరిచయమై, ప్రస్తుతం 'మట్టి కుస్తీ' అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకూ దగ్గరవుతున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన పంచుకున్న పలు ఆసక్తికర విషయాలు..

పేరు : విష్ణు విశాల్‌
అసలు పేరు : విశాల్‌ కుదవ్లా
పుట్టిన తేదీ : జులై 17, 1984
పుట్టిన ప్రాంతం : వెల్లోర్‌, తమిళనాడు
నివాస ప్రాంతం : చెన్నరు
చదువు : ఎంబిఎ
జీవిత భాగస్వామి : జ్వాలా గుత్త
పిల్లలు : ఆర్యన్‌
తల్లిదండ్రులు : రమేష్‌ కుదవ్లా, ఆశా కుదవ్లా
తోబుట్టువులు : రుద్ర, అంచల్‌

విష్ణు విశాల్‌ తమిళ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన నటుడు, నిర్మాత. 'వెన్నిల' చిత్రంతో తమిళంలో సినీ రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత 'కబడ్డీ కుజు', 'నీర్పరవై', సైకలాజికల్‌ థ్రిల్లర్‌ 'రాత్ససన్‌' వంటి చిత్రాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా 'ఎఫ్‌ఐఆర్‌', అరణ్య, కాదన్‌ వంటి చిత్రాల్లోనూ నటించారు. అయితే తెలుగులో రవితేజ, విష్ణు విశాల్‌ నిర్మాణంలో 'మట్టి కుస్తీ' అనే చిత్రం ద్వారా పరిచయమవుతున్నారు. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. విష్ణు విశాల్‌ మాట్లాడుతూ.. 'మట్టి కుస్తీ' భార్యాభర్తల ప్రేమ కథ. భార్యాభర్తల మధ్య జరిగే ఇగో కుస్తీ. కథలో కుస్తీ స్పోర్ట్‌ కూడా భాగంగా వుంటుంది. కేరళలో 'మట్టి కుస్తీ' అనే స్పోర్ట్‌ వుంది. ఇందులో హీరోయిన్‌ కేరళ అమ్మాయి. అలా ఈ చిత్రానికి 'మట్టి కుస్తీ' అనే పేరు పెట్టాం. పెళ్లి తర్వాత భార్యాభర్తలకు కొన్ని అంచనాలు వుంటాయి. ఆ అంచనాలని అందుకోలేనప్పుడు ఇగోలు మొదలౌతాయి. 'మట్టి కుస్తీ' అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌. స్పోర్ట్స్‌ కూడా లైట్‌ హార్టెడ్‌గా వుంటుంది. సినిమా చాలా వినోదాత్మకంగా వుంటుంది. 'మట్టి కుస్తీ'లో నా కెరీర్‌లో మొదటి అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ కమర్షియల్‌ మసాల ఫిల్మ్‌ అని తెలిపారు.

                                                                 నా కెరీర్‌లో ఇది అతిపెద్ద సినిమా..

'నేను జ్వాలా గుత్తాను పెళ్లి చేసుకున్న విషయం మీకు తెలిసిందే. నేను తెలుగింటి అల్లుడిని. నేను జ్వాలాని పెళ్లి చేసుకున్నాక తెలుగు సినిమాలు చేయమని జ్వాలా నన్ను హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. నా కెరీర్‌లో అతిపెద్ద సినిమా 'మట్టి కుస్తీ' తో ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను. ఇందుకు కారణమైన జ్వాలాకు, నన్ను నమ్మి సినిమాను నిర్మించిన రవితేజ సర్‌కు ధన్యవాదాలు. రాక్షసన్‌, అరణ్య, ఎఫ్‌ఐఆర్‌ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు నేను తెలుసు. ఇప్పుడు మట్టి కుస్తీతో మీ ముందుకు వస్తున్నా. ఎంటర్‌టైన్‌మెంట్‌, కంటెంట్‌ ఉన్న సినిమాలను తెలుగు ఆడియన్స్‌ ఎంతగానో ఆదరిస్తారు. ఇందులో ఎంటర్టైన్మెంట్‌తో పాటు మంచి కంటెంట్‌ ఉంది. ఏ హీరో, ఏ భాష అనేది చూడకుండా కంటెంట్‌ను మాత్రమే చూసి, ఆదరించే తెలుగు ప్రేక్షకులపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఈ సినిమాలో మంచి మెసేజ్‌ కూడా ఉంది. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఎంజారు చేయాలని కోరుతున్నా' అన్నారు.
 

                                                                 ఆ మాట విని నేను షాక్‌ అయ్యా..

'నేను 13 ఏళ్లుగా తమిళ ఇండిస్టీలో ఉన్నాను. నిర్మాతల కోసం చాలా మంది దగ్గరికి తిరిగిన రోజులు ఉన్నాయి. ఏదైనా ఒక సినిమా కోసం నిర్మాత దగ్గరికి వెళ్తే నా బిజినెస్‌, మార్కెట్‌, ఎంత వస్తుంది.. అని ఇలా లెక్కలు మాట్లాడేవాళ్లు. కానీ రవితేజ నా టాలెంట్‌ చూసి, నాకు సపోర్ట్‌ చేయడానికి ముందుకొచ్చారు. 'ఎఫ్‌ఐఆర్‌' సినిమాని తెలుగులో విడుదల చేసే సమయంలో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్‌ ద్వారా రవితేజని కలిశాను. నేను చేసే సినిమాలు రవితేజకి చాలా నచ్చాయి. ఆ తర్వాత నా కథ విని, ప్రొడ్యూస్‌ చేస్తా అన్నారు. ఆ మాట విని నేను షాక్‌ అయ్యా. ఆయన వల్లే తెలుగులోనూ నా సినిమా రిలీజ్‌ అవుతుంది' అని తెలిపారు.
 

                                                       కమర్షియల్‌ నుంచి కంటెంట్‌కి మారుతున్నారు..

'ప్రతి ఇండిస్టీకి ఒక యూనిక్‌ నెస్‌ ఉంటుంది. బాహుబలితో తెలుగు సినిమా ప్రపంచ దష్టిని ఆకర్షించింది. ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప, కేజీఎఫ్‌, కాంతారా, విక్రమ్‌, పీఎస్‌ 1 ఇలా అన్ని పరిశ్రమల నుండి మంచి చిత్రాలు వస్తున్నాయి. ఇప్పుడు సౌత్‌లో గొప్ప వాతావరణం ఉంది. ఇండియన్‌ సినిమాలో సౌత్‌ గురించి ఇప్పుడు గొప్పగా మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం. అలాగే 'రాత్ససన్‌' నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాను. ప్రేక్షకులు కమర్షియల్‌ నుంచి కంటెంట్‌కి మారుతున్నారని రుజువు చేసిన చిత్రమది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో కంటెంట్‌ ఉన్న చిత్రాలు చేయాలనే నిర్ణయం ఆ సినిమా నుండే తీసుకున్నాను. కాగా జ్వాలా సినిమాలు ఎక్కువ చూస్తుంది. అయితే తనకి నటన పట్ల ఆసక్తి లేదు. ఇది వరకు ఎప్పుడో ఒక పాటలో కనిపించింది. ఆ విషయంలో ఇప్పటికీ రిగ్రెట్‌ ఫీలవుతుంటుంది. ఇంకెప్పుడూ తనని నటించమని అడగొద్దు' అని చెప్పింది. కాగా విష్ణు విశాల్‌ నిర్మాణంలో ఇంకా మూడు సినిమాలు ఉన్నాయి. 'మోహన్‌ దాస్‌' చిత్రం చిత్రీకరణలో ఉంది. సత్యజ్యోతి దర్శకత్వంలో ఓ సినిమా, రజనీకాంత్‌తో 'లాల్‌ సలాం' చిత్రాల్లో నటిస్తున్నారు.