Aug 13,2023 12:59
  • కార్చిచ్చు ధాటికి తల్లడిల్లుతున్న చారిత్రక నగరం
  • 80కి పెరిగిన మృతుల సంఖ్య

లాహైనా, హవాయి : హవాయిలోని మౌయి ద్వీపంలో ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి మొదలైన కార్చిచ్చు పెనుబీభత్సం సృష్టించింది. ఇప్పటి వరకు 80 మంది వరకు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. శతాబ్దాల నాటి నగరమైన లాహైన్‌లో ఎక్కడ చూసినా శిధిలాల కుప్పలు కనిపిస్తున్నాయి. విషాద మేఘాలు కమ్ముకున్నాయి. ఇంకా ఎవరైనా శిధిలాల కింద చిక్కుకుపోయారేమోనని సహాయ బృందాలు అన్వేషిస్తున్నాయి. అయితే సుదూర ప్రాంతంలోని తుపాను ప్రభావం కారణంగా బలమైన గాలులు వీచడంతో మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. చూస్తుండగానే మంటలు చుట్టుముట్టాయి.
      కార్చిచ్చు ధాటికి వేల సంఖ్యలో నివాసాలు, ఇతర భవనాలు కాలిబూడిదయ్యాయి. రోడ్డు మీద నిలిపి ఉంచిన వాహనాలు నామరూపాల్లేకుండా దగ్ధమయ్యాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. వందల సంఖ్యలో పిల్లులు, పక్షులు, ఇతర జంతువులు మంటల్లో కాలిపోయాయి. కార్చిచ్చు కారణంగా వేల మంది నిరాశ్రయులయ్యారు. సర్వం కోల్పోయి తమ భవిష్యత్తు ఏంటో తెలియక అంధకారంలో కూరుకుపోయారు. దాదాపు 1500మంది అత్యవసర సహాయ శిబిరాల్లో తల దాచుకున్నారు.
         ఆస్తినష్టం పరంగా హవాయి చరిత్రలోనే రెండో అతిపెద్ద విపత్తు ఇదని అధికారులు పేర్కొన్నారు. మౌయి దీవిలో ఉండే ఈ పట్టణానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఒకప్పుడు హవాయిన్‌ రాజ కుటుంబం ఇక్కడ నివసించింది. ప్రస్తుతం ఇక్కడ 12వేల మంది నివాసముంటున్నారు. పర్యాటకంగానూ ఈ నగరం ప్రత్యేకమైనది. ఈ వారంలో మౌయి ద్వీపంలో మూడు దావానలాలు చెలరేగాయి. మంటలు చెలరేగి మూడు రోజులు గడిచినా ఇంకా అక్కడక్కడ మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. అయితే తమ ఇళ్ళకు జరిగిన నష్టాన్ని అంచనా వేసుకునేందుకు, ఇంకా ఏమైనా మిగిలితే తీసుకెళ్ళేందుకు ప్రజలను అనుమతించారు. ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించింది. కాగా ప్రజలను మంటల గురించి హెచ్చరిస్తూ వార్నింగ్‌ బెల్స్‌ కూడా మోగలేదని చెబుతున్నారు. దీనిపై దర్యాప్తు జరపనున్నట్లు హవాయి అటార్నీ జనరల్‌ తెలిపారు.