Oct 13,2023 14:41

మెదక్‌: కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌ అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణకు చేరవేస్తోందని మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల్లో డబ్బు పంచి గెలిచేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. శుక్రవారం మెదక్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మంత్రి మాట్లాడారు. బెంగళూరులో జరిగిన ఐటీ దాడుల్లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు అత్యంత సన్నిహితుడైన అంబికా పతి, ఆయన భార్య అశ్వత్త ఇంట్లో రూ.52 కోట్లు పట్టుబడ్డాయన్నారు.కర్ణాటకలో గతంలో అధికారంలో బిజెపి కాంట్రాక్టర్‌ల దగ్గర 40 శాతం కమీషన్‌ వసూలు చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్‌ 50 శాతం వసూలు చేస్తోందని ఆరోపించారు. ఇలా కాంగ్రెస్‌ స్కాంగ్రెస్‌గా మారిందని ధ్వజమెత్తారు. తెలంగాణలో టికెట్‌లు అమ్ముకొంటున్నట్టు ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ఎన్ని నోట్ల కట్టలు పంచినా.. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో గెలిచేది బిఆర్‌ఎస్‌నే అని మంత్రి హరీశ్‌ ధీమా వ్యక్తం చేశారు.