May 02,2023 21:19

భూటాన్‌: ఆసియాకప్‌ పురుషుల క్రికెట్‌ టోర్నీకి నేపాల్‌జట్టు అర్హత చరిత్ర సృష్టించింది. మంగళవారం జరిగిన ఫైనల్లో నేపాల్‌ జట్టు 7వికెట్ల తేడాతో యుఏఇపై ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన యుఏఇ జట్టు 33.1ఓవర్లలో 117పరుగులకే కుప్పకూలింది. లలిత్‌(4/14) బౌలింగ్‌లో మెరిసాడు. యుఏఇ బ్యాటర్‌ ఆసిఫ్‌ ఖాన్‌(46) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించాడు. ఛేదనలో నేపాల్‌ జట్టు 30.3ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 118పరుగులు చేసి విజయం సాధించింది. గుల్షన్‌(67నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించగా.. రోహన్‌(2/13)బౌలింగ్‌లో మెరిసాడు. దీంతో నేపాల్‌ క్రికెట్‌ జట్టు తొలిసారి ఆసియాకప్‌-2023 ప్రధాన టోర్నీకి అర్హత సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. మొత్తం 10జట్లు క్వాలిఫై టోర్నీలో ఆడగా.. గ్రూప్‌-ఏనుంచి నేపాల్‌, ఒమన్‌, గ్రూప్‌-బి నుంచి యుఏఇ, కువైట్‌ సెమీస్‌కు చేరాయి.
ఆసియాకప్‌ వాయిదా లేదు: ఏసిసి
ఆసియా కప్‌ను వాయిదా వేసే ప్రతిపాదనేదీ లేదని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసి) ఓ ప్రకటనలో పేర్కొంది. ఆసియా కప్‌ను వాయిదా వేసి, అదే సమయంలో పాక్‌ను తప్పించి మరో టోర్నీని దుబారులో ఆడించే అవకాశాలు ఉన్నాయని మీడియాలో వచ్చిన కథనాలు నేపథ్యంలో ఏసీసీ వర్గాలు ఈ వివరణ ఇచ్చాయి. ''ఆసియా కప్‌ వాయిదా గురించి ఎలాంటి చర్చ జరగలేదు. ఒకవేళ టోర్నీ రద్దు చేస్తే ముందుకు పీసీబీకే చెబుతారు. ఇప్పటివరకు అలాంటిదేమీ జరగలేదు. ఆసియాకప్‌ను వాయిదా వేయాలన్నా, రద్దు చేయాలన్నా ఏసీసీ ముందు ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశం నిర్వహించాలి. సభ్య దేశాలకు ఇప్పటివరకు అలాంటి సమాచారమేమీ లేదు'' అని ఓ ఏసీసీ అధికారి చెప్పాడు. షెడ్యూలు ప్రకారం ఆసియా కప్‌ పాకిస్థాన్‌లో జరగాల్సివుంది. కానీ పాక్‌ వెళ్లేందుకు భారత్‌ నిరాకరిస్తోంది. ఆసియాకప్‌ను తటస్థ వేదికపై ఆడడానికి పీసీబీ అంగీకరించకపోతే టోర్నీ ఆతిథ్య హక్కులను పాక్‌ నుంచి వెనక్కి తీసుకునే అవకాశముందని పాకిస్థాన్‌ మీడియాలో వార్తలొచ్చాయి.