- ఫైనల్లో ఆకర్షీ కశ్యప్‌పై గెలుపు
న్యూఢిల్లీ: జాతీయ మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా 18ఏళ్ల అనుపమ ఉపాధ్యాయ నిలిచింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అనుపమ 20-22, 21-17, 24-22తో ఆకర్షీ కశ్యప్‌పై సంచలన విజయం సాధించింది. పూణే వేదికగా జరిగిన సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో మూడుసెట్ల హోరాహోరీ పోరులో ప్రపంచ జూనియర్స్ 3వ ర్యాంకర్ 21ఏళ్ల ఆకర్షీపై గెలిచింది. పోటాపోటీగా సాగిన తొలి గేమ్‌లో అనుమప చివర్లో వరుసగా రెండు పాయింట్లు చేజార్చుకొని ఆ గేమ్‌ను చేజార్చుకుంది. ఆ తర్వాత డ్రాప్ షాట్లతో చెలరేగిన ఆకర్షీ.. ఓ దశలో 6-1పాయింట్ల ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో పుంజుకున్న అనుపమ రెండో గేమ్ అర్ధభాగం ముగిసే సమయానికి 11-6 ఆధిక్యతలో నిలిచింది. ఈ క్రమంలోనే ఆ గేమ్‌ను 21-17తో ముగించడంతో ఇరువురు షట్లర్లు ఒక్కో గేమ్ గెలిచి 1-1తో సమంగా నిలిచారు. ఇక మూడో గేమ్‌లో ఆకర్షీ ఓ దశలో 11-8పాయింట్ల ఆదిక్యతలోకి దూసుకెళ్లినా.. చివర్లో ఇరువురు షట్లర్లు 19-19తో సమంగా నిలిచారు. ఆ తర్వాత అనుపమ మెరుగైన ఆటతీరును ప్రదర్శించి వరుసగా రెండు పాయింట్లు గెలిచి ఆ గేమ్‌ను 24-22తో ముగించి నయా ఛాంపియన్‌గా అవతరించింది.










