Jul 13,2022 10:25

ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌) : తమ సమస్యలను పరిష్కరించాలంటూ.. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారంతో మూడో రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా నందిగామ నగర పంచాయతీ పరిధిలో పారిశుధ్య కార్మికులు మోకాళ్ళు పై నిలబడి నిరసన తెలిపారు. మున్సిపల్‌ కార్మికులు చేసే సమ్మెకు కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చనుమోలు సైదులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కటారపు గోపాల్‌ మాట్లాడుతూ ... రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా సమయంలో కార్మికులు చేసిన త్యాగాలు గుర్తుకు రావటం లేదా అని ప్రశ్నించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రధానంగా కార్మికుల సంక్షేమ పథకాలు అమలు కావడం లేదనీ, కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ పారిశుద్ధ్య సీనియర్‌ నాయకులు పుట్ట మాణిక్యం, ఆకుల బేబీ, సతీష్‌, రమేష్‌, బలగాని కోటేశ్వరావు, భీమవరం శీను, కార్మికులు పాల్గొన్నారు.