Sep 26,2023 16:08

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పదేపదే అవమానిస్తూ, అనవసరంగా మోడీ ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారని అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం.. ఆ పార్టీకి తెలంగాణలో పుట్టగతులుండవు అని కేటీఆర్‌ తేల్చిచెప్పారు. అక్టోబర్‌ 1వ తేదీన పాలమూరు జిల్లా పర్యటనకు వస్తున్న మోదీపై కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌తో పాటు బహిరంగ వేదికల మీద ఎందుకు విషం చిమ్ముతున్నారు అని నిలదీశారు. తెలంగాణ అంటేనే గిట్టనట్టు, పగబట్టినట్టు, తెలంగాణ పుట్టుకను, అస్థిత్వాన్ని ఎందుకు అగౌరవపరుస్తున్నారని మోదీని నిలదీశారు కేటీఆర్‌. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని, తెలంగాణ ప్రజల త్యాగాన్ని కించపరిచే విధంగా చాలాసార్లు పార్లమెంట్‌ వేదికగా మోదీ విషం చిమ్మారు. అమఅత కాల్‌ సమావేశాలని చెప్పి.. తెలంగాణ సమాజంపై విషం చిమ్మారు. మోదీ అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. 14 ఏండ్ల పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ పట్ల, కేసీఆర్‌ నాయకత్వం పట్ల కొంత ఇబ్బంది ఉండొచ్చు మీకు. కానీ జయశంకర్‌ సార్‌, తెలంగాణ ప్రజల త్యాగాల పట్ల ఎందుకు చిన్నచూపు అని మోదీని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన హామీలను కూడా మోడీ పాతరేశారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.