Feb 09,2023 21:45
  • రంజీట్రోఫీ సెమీఫైనల్స్‌

బెంగళూరు: సౌరాష్ట్రతో జరుగుతున్న రంజీట్రోఫీ సెమీఫైనల్లో కర్ణాటక కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌(249) డబుల్‌ సెంచరీతో కదం తొక్కాడు. దీంతో కర్ణాటక జట్టు రెండోరోజు 407పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 5వికెట్ల నష్టానికి 229పరుగులతో రెండోరోజు ఆటను కొనసాగించిన కర్ణాటక జట్టును కెప్టెన్‌ డబుల్‌ సెంచరీతో ఆదుకున్నాడు. వికెట్‌ కీపర్‌ శరత్‌(66) అర్ధసెంచరీ మినహా మిగతా బ్యాటర్స్‌ నిరాశపరిచారు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్స్‌ ఘోరంగా విఫలమయ్యారు. సౌరాష్ట్ర బౌలర్లు సకారియా, కుశాంగ్‌కు మూడేసి, చిరాగ్‌, ప్రేరక్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌరాష్ట్ర జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి 2వికెట్ల నష్టానికి 76పరుగులు చేసింది. స్నేల్‌ పటేల్‌(0), వి. జడేజా(22) నిరాశపరచగా.. ఓపెనర్‌ దేశారు(27), షెల్డన్‌(27) క్రీజ్‌లో ఉన్నారు.
కటక్‌ వేదికగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మరో సెమీస్‌లో బెంగాల్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 438పరుగులకు ఆలౌటైంది. రెండోరోజు బెంగాల్‌ వికెట్‌ కీపర్‌ అభిషేక్‌(51) మాత్రమే అర్ధసెంచరీతో రాణించారు. కార్తికేయకు మూడు, గౌరవ్‌, అనుభవ్‌కు రెండేసి, ఆవేశ్‌ఖాన్‌, శరత్‌ జైన్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మధ్యప్రదేశ్‌ జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు నష్టపోయి 56పరుగులు చేసింది.