Feb 05,2023 08:46

ఎవరికైనా విజయం దక్కాలంటే ఏళ్ల తరబడి ఎదురుచూడాలి. అయితే చిత్ర పరిశ్రమలో అలా ఉండదు. ఒక్క హిట్టు చిత్రం తగిలిందంటే విజయం సొంతమైనట్లే.. అలా ఒకే ఒక్క చిత్రంతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు కన్నడ హీరోయిన్‌ సప్తమి గౌడ. ఎన్నో సినిమాల్లో నటిస్తే కానీ రాని పేరు.. ఒక్క చిత్రంతోనే దక్కడం చాలా అరుదనే చెప్పాలి. ఒక్కోసారి విజయాలు సొంతమైనా సరైన గుర్తింపు దక్కని తారలూ లేకపోలేదు. శాండల్‌వుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ 'కాంతార'తో సప్తమి గౌడ అలాంటి గుర్తింపునే సంపాదించారు. ఈ చిత్రం పాన్‌ ఇండియా హిట్‌గా నిలవడంతో సప్తమికి ఓవర్‌ నైట్‌ క్రేజ్‌ వచ్చేసింది. 'కాంతార' ఆమెకు రెండో సినిమా కావడం విశేషం. దీంతోపాటు 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి తెరకెక్కించనున్న బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ 'ది వ్యాక్సిన్‌ వార్‌'లో సప్తమి కీలకపాత్ర పోషించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురించిన మరిన్ని ఆసక్తికర విషయాలు..

సినీ రంగంలో కథానాయికలకు మంచి గుర్తింపు రావడానికి చాలా సమయమే పడుతుంది. అయితే కొందరి విషయంలో మాత్రం ఒకటి, రెండు సినిమాలతో ఎక్కడలేని పాపులారిటీ వచ్చేస్తుంది. అలా సప్తమి గౌడ 2020 సంవత్సరంలో దునియా సూరి 'పాప్‌ కార్న్‌ మంకీ టైగర్‌' అనే కన్నడ చిత్రంతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే తన నటనతో కన్నడిగుల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత 'కాంతార'తో ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో సప్తమీ గౌడకు క్రేజ్‌తో పాటు అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయి. సప్తమీ నేషనల్‌ లెవెల్‌ స్విమ్మర్‌ కూడా. డ్యాన్సింగ్‌, బుక్‌ రీడింగ్‌, ట్రావెలింగ్‌ ఈమె హాబీస్‌ కావడం గమనార్హం. ఫిట్‌నెస్‌కు సప్తమి గౌడ ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.
కాగా తాజాగా సప్తమీకి బంపర్‌ ఆఫర్‌ తగిలింది. 'ది కశ్మీరీ ఫైల్స్‌' డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రీ దర్శకత్వం వహిస్తున్న 'ది వాక్సిన్‌ వార్‌' చిత్రంలో ఓ కీలకపాత్ర కోసం సప్తమీ గౌడను మేకర్స్‌ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అనుపమ్‌ ఖేర్‌, నానా పటేఖర్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటుంది. మూడో సినిమాకే సప్తమీకి బాలీవుడ్‌ ఆఫర్‌ వరించడం విశేషమనే చెప్పాలి. దీంతో పాటు సప్తమీగౌడ కన్నడంలో మరో మూడు సినిమాల్లోనూ నటిస్తున్నారు.

  • ఒరిజినాలిటీ కోసం రిస్క్‌ చేశా..

అయితే ఆ మధ్య సినిమా ప్రమోషన్స్‌లో సప్తమి మాట్లాడుతూ ఈ సినిమా కోసం తాను చాలా రిస్క్‌ చేసినట్లు చెప్పుకొచ్చారు. 'మొదటి నుంచి నాకు ముక్కుపుడక లేదు. ఈ పాత్ర గురించి దర్శకుడు చెప్పినప్పుడు రెండు ముక్కుపుడకలూ ఉండాలని చెప్పారు. అవి సహజంగా ఉండాలని ఒరిజినల్‌గా ముక్కు కుట్టించుకున్నాను.. రెండు వైపులా నిజంగానే ముక్కు కుట్టించుకున్నాను' అని చెప్పుకొచ్చారు. సాధారణంగా అయితే హీరోయిన్లు ఇన్‌స్టంట్‌ ముక్కుపుడకలను అతికించుకుంటారు. కానీ తాను మాత్రం ఒరిజినాలిటీ కోసం ఇంత రిస్క్‌ తీసుకున్నానని తెలిపారు.

2
  • అస్సలు ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు..

'కాంతార' చిత్రం కన్నడతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఇంతటి ఘనవిజయం సాధిస్తుందని తాను ఊహించలేదన్నారు. దేశవ్యాప్తంగా సినీ అభిమానుల నుంచి ఈ స్థాయిలో ప్రేమను ఎక్స్‌పెక్ట్‌ చేయలేదని, తన కెరీర్‌లో ఇంత త్వరగా గుర్తింపు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని పేర్కొన్నారు. 'కాంతార'లో భాగమైనందుకు గర్వంగా, చెప్పలేనంత సంతోషంగా ఉందని సప్తమి తెలిపారు. ఈ సినిమాలో ఛాన్స్‌ దక్కడం తన అదృష్టమన్నారు.

  • రిషబ్‌ నమ్మకాన్ని నిలబెట్టుకున్నా..

'ఈ ప్రాజెక్టు కోసం తొలుత నన్ను సంప్రదించినప్పుడు కథేంటో, పాత్ర ఎలా ఉంటుందనే విషయం తెలియదు. కానీ, దర్శకుడు, హీరో అయిన రిషబ్‌శెట్టి నాపై నమ్మకం ఉంచి.. నన్ను కథానాయికగా ఎంపిక చేశారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు.. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే భావిస్తున్నా. ఇకపై ఇతర భాషల సినిమాల్లో నటించే అవకాశాలు వస్తే ఏ మాత్రం సంకోచించకుండా చేస్తా. వాటికి ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు' అని సప్తమి స్పష్టం చేశారు.
''కాంతార' సినిమా చూసిన తర్వాత ఓసారి వివేక్‌ సర్‌ రిషబ్‌శెట్టికి ఫోన్‌ చేసి నా నంబర్‌ తీసుకున్నారు. ఆ తర్వాత నాకు ఫోన్‌ చేశారు. ''నేను ఒక సినిమా చేస్తున్నా. అందులో నువ్వు భాగమైతే ఆనందిస్తా'' అని అన్నారు. ఆ మాటకు నేను ఎంతో సంతోషించాను. వేరే ఆలోచన లేకుండా ఓకే అనేశాను. దాంతో ఆయన నాకు 'ది వ్యాక్సిన్‌ వార్‌' స్క్రిప్ట్‌, అందులో నా పాత్ర గురించి వివరించారు. బాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నందుకు ఆనందంగా ఉంది. భాషాపరంగా కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ, వివేక్‌ సర్‌ నాకెంతో సాయం చేస్తున్నారు. వేరే భాషల్లో సినిమాలు చేయడం నాకూ ఇష్టమే. కాకపోతే నా మొదటి ప్రాధాన్యం కన్నడ సినిమాలే. అక్కడ మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలని ఉంది' అని సప్తమి వివరించారు.

1

పేరు: సప్తమీ గౌడ
పుట్టిన తేదీ: జూన్‌ 8, 1996
పుట్టిన ప్రాంతం: బెంగళూరు
చదువు: సివిల్‌ ఇంజనీర్‌
తల్లిదండ్రులు: ఉమేష్‌ ఎస్‌కె డొడ్డి (అసిస్టెంట్‌ కమిషనర్‌), శాంతా మదారు
తోబుట్టువులు: ఉతరీ గౌడ
హాబీస్‌: స్విమ్మింగ్‌, ట్రావెలింగ్‌, డ్యాన్సింగ్‌, రీడింగ్‌