Aug 16,2022 07:35

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశవ్యాప్తంగా సిపిఎం శ్రేణులు త్రివర్ణ పతాకాన్ని తమ కార్యాలయాలవద్ద ఎగురవేసి, దేశ రాజ్యాంగం విలువల పరిరక్షణకు ప్రతినబూనాయి. సోమవారం సిపిఎం కేంద్ర కార్యాలయం (ఎకెజి భవన్‌)లో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు తపన్‌ సేన్‌, నిలోత్పల్‌ బసు, కేంద్ర కమిటీ సభ్యులు మురళీధరన్‌, ఢిల్లీ కార్యదర్శి కెఎం తివారీ తదితరులు పాల్గొన్నారు. కేరళలోని తిరువనంతపురంలో సిపిఎం రాష్ట్ర కార్యాలయం (ఎకెజి సెంటర్‌)లో సిపిఎం సీనియర్‌ నేత రామచంద్రన్‌ పిళ్లై జెండా ఆవిష్కరించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్‌ రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు. త్రిసూర్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ విజయరాఘవన్‌ జెండా ఆవిష్కరించారు. పశ్చిమబెంగాల్‌ లోని కోల్‌కతాలో సిపిఎం రాష్ట్ర కార్యాలయం (ముజఫర్‌ ఆహ్మద్‌ భవన్‌)లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఛైర్మన్‌ బిమన్‌ బసు జెండా ఆవిష్కరించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎండి సలీం, సూర్యకాంత్‌ మిశ్రా పాల్గొన్నారు. త్రిపురలో రాజ్యాంగం, లౌకికవాదం, సమగ్రత, సార్వభౌమౌధికారం కాపాడాలని సిపిఎం కార్యకర్తలు వందలాది కిలోమీటర్ల రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర కార్యాలయంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి జెండా ఆవిష్కరించారు. కమలాఘాట్‌ వద్ద రక్తదాన శిబిరాన్ని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ ప్రారంభించారు. తమిళనాడులో సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ, పొలిట్‌బ్యూరో సభ్యులు రామకృష్ణ పాల్గొన్నారు. జెండా ఆవిష్కరించి రాజ్యాంగ పీఠికతో ప్రతిజ్ఞ చేశారు. కర్ణాటకలోని బెంగళూర్‌లో, జార్ఖండ్‌లోని రాంచీలో, పంజాబ్‌ చండీగఢ్‌లోని సిపిఎం రాష్ట్ర కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అన్ని రాష్ట్రాల్లో, జిల్లాల్లో, మండలాల్లో సిపిఎం ఆధ్వర్యాన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.