ప్రజాశక్తి-హిందూపురం:భూపోరాటం చేస్తూ భూములు తమకు దక్కుతాయో లేదో అన్న దిగులుతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కొండూరులో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు... కుశలవ కంపెనీ యాజమాన్యంపై కొండూరు రైతులుతో పాటు వెంకటేష్(35) భూ పోరాటం సాగిస్తున్నారు. రెండు నెలల క్రితం భూముల విషయంలో దిగులు చెంది వెంకటేష్ తండ్రి చనిపోయారు. భూములపై అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం రాకపోవడంతో వెంకటేష్ మనస్తాపానికి గురై ఆదివారం చెట్టుకు ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలిసిన లేపాక్షి తహశీల్దార్ కె బాబు, రూరల్ సిఐ వేణుగోపాల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం హిందూపురం జిల్లా ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే భూ బాధితులు వారికి కేటాయించిన భూముల కోసం పోరాటం చేస్తూ భూములు తమకు దక్కుతాయో లేదా అన్న దిగులుతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారని దళిత రైతులు, సిపిఎం, కెవిపిఎస్ నాయకులు వాపోతున్నారు. మృతిచెందిన యువ రైతు కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.










