Apr 27,2023 06:34
  • బెంగళూరుపై 21 పరుగుల తేడాతో గెలుపు
  • జేసన్‌ రాయ్ అర్ధసెంచరీ

బెంగళూరు: ఐపిఎల్‌ సీజన్‌-16లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఊరట లభించింది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమి తర్వాత బుధవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై 21 పరుగుల తేడాతో కోల్‌కతా గెలిచి ఊపిరి పీల్చుకుంది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 200పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. ఛేదనలో బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్లు కోల్పోయి 179పరుగులే చేయ గల్గింది. ఈ గెలుపులో కోల్‌కతా 8 మ్యాచుల్లో మూడో విజయాన్ని నమోదు చేసుకోగా.. బెంగళూరు జట్టు వరుసగా రెండు విజయాల తర్వాత ఓటమిని చవిచూసింది.

2


ఇక టాస్‌ గెలిచిన బెంగళూరుజట్టు బౌలింగ్‌ను ఎంచుకొంది. దీంతో కోల్‌కతా ఇన్నింగ్స్‌ను జగదీశన్‌, జేసన్‌ రాయ్ఆరంభించారు. జేసన్‌ రారు కేవలం 29బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. నారాయణ్‌ జగదీశన్‌ 29 బంతుల్లో 27 పరుగులు చేశారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 9.2 ఓవర్లలో 83పరుగులు జతచేశారు. ఈ జోడీని విజయ్ కుమార్‌ వైశక్‌ విడదీశాడు. 10వ ఓవర్‌ రెండో బంతికి జగదీశన్‌ను, ఆ వెంటనే జేసన్‌ రారు వికెట్లను విజరు కుమార్‌ పడగొట్టాడు. కెప్టెన్‌ నితీష్‌ రాణా 48 పరుగుల వద్ద ఔట్‌ కావడంతో తృటిలో అర్ధ సెంచరీని మిస్‌ చేసుకున్నాడు. నితీష్‌ రాణా 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేశాడు. వెంకటేష్‌ అయ్యర్‌ 26 బంతుల్లో 31 పరుగులు చేయగా.. ఆర్సీబీ బౌలర్లలో హసరంగ, విజరు కుమార్‌ చెరో రెండేసి, సిరాజ్‌కు ఒక వికెట్‌ లభించింది. ఛేదనలో బెంగళూరు కెప్టెన్‌ కోహ్లి(54) అర్ధసెంచరీతో రాణించినా.. డుప్లెసిస్‌(17), మ్యాక్స్‌వెల్‌(5) నిరాశపరిచారు. వరుణ్‌ చక్రవర్తికి మూడు, సుయాశ్‌, ఆండీ రస్సెల్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.